ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఇటీవల తన ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వీటి సేల్ ఆగస్టు 24 నుంచి ప్రారంభం అవుతుందని చెప్పినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సేల్ తేదీని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ సేల్ ఆగస్టు 27వ తేదీన జరగనున్నట్లు ప్రకటించింది. మోటొరోలా ఎడ్జ్ 20 సేల్ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. కొత్త సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. ఇక ఎడ్జ్ 20 స్మార్ట్ ఫోన్ ప్రీఆర్డర్లు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు మోటొరోలా వెల్లడించింది.
మోటొరోలా ఎడ్జ్ 20 వేరియంట్లు, ధర..
మోటొరోలా ఎడ్జ్ 20.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. ఈ ఫోన్ ధర రూ.29990గా ఉంది. ఇది ఫ్రాస్టెడ్ పెర్ల్, ఫ్రాస్టెడ్ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఆగస్టు 24న (ఈ రోజు) మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.
మోటొరోలా ఎడ్జ్ 20 ఫీచర్లు..
డ్యూయల్ సిమ్ (నానో) మోటరోలా ఎడ్జ్ 20.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత మైయూఎక్స్ తో పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ మ్యాక్స్ విజన్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా, రిఫ్రెష్ రేట్ 144Hzగా ఉంది. ఇందులో 576 Hz టచ్ లేటెన్సీ ఇందులో అందించారు.
ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. దీని బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
దీనికి వెనకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. మెయిన్ కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.