ఏపీలో బీసీల అభ్యన్నతికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా తాము విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ శాప్‌నెట్ చైర్మన్‌గా బాచిన కృష్ణ చైతన్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. జగన్ మోహన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకూ ఆత్మ గౌరవం పెరిగిందని చెప్పారు. హఠాత్తుగా ఎన్నికలు వచ్చిన ప్రజలు వైసీపీనే ఎన్నుకుంటారని.. జగనే ముఖ్యమంత్రిగా ఉండాలనే తీరుగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. బీసీల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. మంత్రి బాలినేని మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు కేటాయించటం ద్వారా తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ... జీవనశైలిని మెరుగుపరిచే కార్యక్రమాలను రూపొందించి శాప్‌నెట్ ద్వారా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణచైతన్యకు సూచించారు.
జంగం కులస్తులకు ప్రాధాన్యం: సజ్జల
శైవ క్షేత్రాల పాలక మండళ్లలో జంగం వారికి ప్రాతినిధ్యం ఇవ్వడంపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని శ్రీశైలం, ఇతర శైవ క్షేత్రాల పాలక మండళ్లలో జంగం కులం వారిని నియమించడంలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో సానుకూల ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర జంగం కార్పొరేషన్ చైర్‌పర్సన్ వావిలేటి ప్రసన్నకుమారి అధ్యక్షతన వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. జంగం కుల ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు సజ్జల ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ప్రతి బీసీ కుటుంబంలో పేదరికాన్ని పొగొట్టాలనే ఉద్దేశంతో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. జంగమ కులస్తుల సమస్యలకు పరిష్కరించాలనే లక్ష్యంతో.. జంగమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జంగమ కార్పొరేషన్.. ఆ కులంలో ఉండే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి కులం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.