రాయలసీమలో రాజకీయం అంటే ఒకప్పుడు రాజకీయం కాదు. వ్యక్తిగత కక్షలు, ఫ్యాక్షన్ తగాదాలు. కానీ ఇప్పటి తరం వాటిని మార్చే ప్రయత్నం చేస్తోంది. నాడు ఫ్యాక్షన్‌లో రాటు దేలిన వాళ్లు కూడా ఇప్పుడు ప్రత్యర్థుల్ని  రాజకీయంగానే చూస్తున్నారు. వ్యక్తిగత శత్రుత్వం ఉందన్న భావన తెచ్చుకోవడం లేదు. దీనికి అనంతపురం జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. పరిటాల శ్రీరామ్ ఈ విషయంలో అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. 


Also Read : పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేసింది ? సొంత క్యాడర్‌ను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది ?


పరిటాల , జేసీ వర్గీయులకు అనంతపురం జిల్లాలో ఉన్న  శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే 2014కి ముందు జేసీ వర్గం అంతా తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. అయిష్టంగా అయినా పరిటాల వర్గం జేసీ వర్గంతో కలిసి పని చేయక తప్పలేదు. అప్పట్నుచి ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఉప్పు-నిప్పులాగే ఉండేది వ్యవహారం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇటీవల  అనంతపురం పర్యటనకు నారా లోకేష్ వచ్చినప్పుడు జేసీ దివాకర్ రెడ్డి తన అనుచరులతో స్వాగతం పలికారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ కూడా అక్కడికి వచ్చారు. ఇది గమనించిన జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీరామ్‌ను సాదరంగా పలకరించారు. శ్రీరామ్ కూడా అంతే సాదరంగా పలకరించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఒక్క సారిగా చల్లబడిపోయినట్లయింది. 


Also Read : పరిస్థితులు చక్కబడగానే ఉద్యోగుల సంక్షేమం .. ఉద్యమబాట పట్టిన యూనియన్లకు ప్రభుత్వం సందేశం !


ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి జేసీ వర్గీయులతో శ్రీరామ్ సామరస్యంగా వ్యవహరించారని అనుకోవచ్చు. కానీ తన రాజకీయ ప్రత్యర్థి అయిన తోపుదుర్తి బ్రదర్స్‌తోనూ అంతే వ్యవహరిస్తున్నారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు  చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద 11మంది నీటి ప్రవాహం లో చిక్కుకున్న సందర్భంలో సహాయక చర్యలు పరిశీలించడానికి పరిటాల శ్రీరామ్ వెళ్ళారు.  ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు  సమీక్షిస్తున్నారు. శ్రీరామ్ రాకను గమనించి చందు ఆహ్వానించారు. భుజం మీద చేతులు వేసి కలిసి వెళ్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన టెన్షన్ పటా పంచలు అయింది. 


Also Read : అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వుల తొలగింపు - అమరావతి కేసుల విచారణ డిసెంబర్ 27కి వాయిదా !


పరిటాల శ్రీరామ్ రాజకీయాల్ని రాజకీయంగానే చేస్తున్నారని వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి రాజకీయాల్ని తీసుకెళ్లడం లేదని .. పరిణితి చెందిన రాజకీయం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే అనంతపురం రాజకీయాల్లో వర్గాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రత్యర్థులతో ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరిగితే.. సొంత వర్గాన్ని కాపాడుకోలేరన్న అభిప్రాయం వినిపిస్తుంది. కానీ శ్రీరామ్ ప్రజల కోసం నిలబడాల్సిన సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ధర్మవరంలో మార్కెట్ తొలగింపు విషయంలో ఆయన దూకుడుగా పోరాడారు. అధికార పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. అందుకే పరిటాల శ్రీరామ్ రాజకీయంలో పరిణితి వచ్చిందని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. 


Also Read : నెల్లూరులో అమరావతి రైతులకు సర్‌ప్రైజ్.. సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి