ఉండవల్లి కరకట్టపై ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించిన వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. అధికార పార్టీగా ఉండి రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే శాంతియుత నిరసన తెలియచేస్తున్న తమపై టీడీపీ నేతలే గూండాల్లా దాడి చేశారని జోగి రమేష్ కారును ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటిముట్టడి !
కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు క్షమాపణ చెప్పాలని.. అయ్యన్నపాత్రుడితో క్షమాపణ చెప్పించాలని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచరులతో సహా చంద్రబాబు ఇంటి ముట్టడికి వచ్చారు. నేరుగా చంద్రబాబు ఇంటి గేటు వద్దకు వెళ్లి బైఠాయించారు. ఆ సమయంలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేశారు. ఆలస్యంగాస్పందించిన పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని చంద్రబాబు ఇంటిదగ్గర నుంచి పంపేశారు. ఐదు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తర్వాత పోలీసులు అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. Also Read : జేసీ వర్సెస్ కాల్వ ! అనంత టీడీపీలో పెరిగిపోతున్న గ్రూపుల గోల !
రాళ్లు, కర్రలతో ఉండవల్లిలో పరస్పర దాడులు !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దాడుల్లో తమ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఇంటిపై పథకం ప్రకారం దాడికి వచ్చారని.. ఫ్యాక్షనిస్టు పాలనలో ఇలాంటి ఘటనలే జరుగుతాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని జగన్ మరో ఆప్ఘనిస్థాన్ చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తక్షణం జోగి రమేష్‌పై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటన గురించి తెలిసిన తర్వాత ఉండవల్లి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు తరలి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీగా ఉండి దౌర్జన్యాలకు పాల్పడటమేమిటని నిలదీశారు. ప్రతిపక్ష నేతకే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తాని ప్రశ్నించారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జగన్ ఎంతో బాగా పరిపాలన చేయాల్సింది.. పూర్తిగా దారి తప్పారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తన ఇంట్లోకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏమీ అనలేదని.. ఇప్పుడు సిఎంగా చేసిన వ్యక్తి ఇంట్లోకే చొరబడే ప్రయత్నం చేశారని.. ఏపీలో లా అండర్ ఆర్డర్ లేదని అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. నారా లోకేష్ ప్రజలు తిరగబడే రోజు దగ్గరకు వచ్చిందని అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఇలా రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Also Read : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు !?
జోగి రమేష్‌పై కేసులు పెట్టాలన్న టీడీపీ నేతలు
చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారన్న కారణంగా జోగి రమేష్‌తో పాటు వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు కానీ కేసులు నమోదు చేశారో లేదో ప్రకటించలేదు. పోలీస్ స్టేషన్ వద్దకు కూడా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత టీడీపీ నేతలందరూ డీజీపీ కార్యలయానికి వెళ్లారు. అక్కడ కూడా పోలీసులు వారిని పట్టించుకోలేదు. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి విషయంలో కేసులు నమోదుపై స్పష్టత ఇవ్వలేదు. Also Read : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమా ? అధికార పార్టీల కసరత్తు అదే చెబుతోందా ?
టీడీపీ నేతలే రౌడీయిజం చేశారన్న వైఎస్ఆర్‌సీపీ !
మరో వైపు తెలుగుదేశం పార్టీనే రౌడీయిజం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తమ నేత జోగి రమేష్ శాంతియుత నిరసన తెలియచేయడానికి వెళ్తే చంద్రబాబు గూండాలతో దాడి చేయించారని ఆరోపించారు. చంద్రబాబు ఓ గుండా అని జోగి రమేష్ విమర్శించారు. జోగి రమేష్‌పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని... శాంతియుత నిరసన తెలుపుతుంటే దాడులు చేస్తారా? అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడితో చంద్రబాబే మాట్లాడించారని రాళ్లు, కర్రలతో జోగి రమేష్‌పై దాడి చేశారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. Also Read : రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం.. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశం
సీఎం జగన్ ఇంటికి భద్రత పెంపు
టీడీపీ నేతలు సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తారన్న ప్రచారం జరగడంతో మధ్యాహ్నం నుంచి తాడేపల్లిలో జగన్ ఇంటికి వెళ్లే దారుల్ని మూసేశారు. ట్రాఫిక్‌ను జాతీయ రహదారి వైపు నుంచి మళ్లించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు. చంద్రబాబు ఇంటి ముట్టడి రోజంతా రెండు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తలకు కారణం అయింది.