నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే జిల్లాలో ఓ కుర్రాడు క్రికెట్ బెట్టింగ్ కి బలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు బెట్టింగ్ వ్యవహారంపై మరింత ఫోకస్ పెంచారు. మ్యాచ్ లు జరిగే సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వారి కదలికలపై నిఘా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో కోవూరు పోలీసులు బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 


కోవూరులోని స్టౌ బీడీ కాలనీలోని ఓ డిగ్రీ కాలేజీ సమీపంలో సద్దాం అనే వ్యక్తి తన ఇంట్లోనే బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్ కి సంబంధించిన సెటప్ అంతా చేసి బెట్టింగ్ రాయుళ్లను ఇంటికే పిలిపించాడు. వీరు ఫోన్లలో వ్యవహారం చక్కబెడుతున్నారు. క్రెడిట్ కార్డ్ లు, డెబిట్ కార్డులు వాడుతూ ఫోన్లలోనే బెట్టింగ్ లు పెడుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని అమాయక యువకులను బలి చేస్తున్నారు. 


పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు రంగంలోకి దిగారు. సద్దాం ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు బెట్టింగ్ నిర్వాహకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 60 వేల రూపాయల నగదు సీజ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ పై వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు పోలీసులు. వీరి వెనక ఉన్న పెద్ద ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా చదువుకునే యువత, రోజు కూలీలు, ఇతర పనులు చేసుకునేవారు ఎక్కువగా బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. వీరిని మెల్లగా ఈ బెట్టింగ్ మాయా లోకం లోకి తీసుకొచ్చి వారి జేబులు గుల్ల చేస్తున్నారు. అప్పులపాలైన చాలామంది ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు బంధువుల వద్దే అప్పు చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విజయరావు బెట్టింగ్ వ్యవహారంపై సీరియస్ గా దృష్టిపెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఎక్కడికక్కడ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.


Also Read: Rajamundry: కన్న బిడ్డల్ని ఉరేసి చంపిన తల్లి.. కారణం తెలిసి అవాక్కైన బంధువులు, స్థానికులు


Also Read: Chittoor Crime: అన్న కాపురం చక్కదిద్దే ప్రయత్నం... హత్యకు గురైన తమ్ముడు... మిస్టరీ డెత్


Also Read: తాకట్టులో ఆంధ్రప్రదేశ్... జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి... ఏపీ సర్కార్ పై పవన్ ట్వీట్ వార్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి