Sai Hira Global Convention Centre: 


మోదీ చేతుల మీదుగా..


ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. పుట్టపర్తిలోని ఈ కేంద్రంలో ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు అకాడమిక్ ప్రోగ్రామ్స్‌ని కూడా ఇక్కడ కండక్ట్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌పర్ట్‌లు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలు పంచుకుంటారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా దేశానికి ఎంతో మంది మేధావులను అందజేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. 


"సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఫోటోలు చూశాను. ఇది తప్పకుండా ఆధ్యాత్మిక సమావేశాలకు, కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుంది. అకాడమిక్ ప్రోగ్రామ్స్‌ కూడా యువతకు ఉపయోగపడతాయి. ఈ అవకాశాన్ని యువతీ యువకులు అందిపుచ్చుకుంటారని, వాళ్లకు ఇది కచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఏదైనా సరే ఓ ఆలోచన గొప్పదవ్వాలంటే అది ఆచరణలోకి రావాలి. అభివృద్ధే లక్ష్యంగా భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సమాజంలోని ప్రతి వర్గం తమ భాగస్వామ్యంతో దేశంలో మార్పు తీసుకొస్తున్నారు"


- ప్రధాని నరేంద్ర మోదీ










ఆయన ఆశీర్వాదం ఉంటుంది..


ఇదే కాన్ఫరెన్స్‌లో సత్యసాయి బాబా గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని. ఈ కేంద్రానికి ఆయన ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయని అన్నారు. మన దేశంలోని సాధువులను ప్రవహించే నీళ్లతో పోల్చుతారని, వాళ్ల ఆలోచనలు ఎక్కడా ఆగకుండా అలా ప్రవహిస్తూనే ఉంటాయని తెలిపారు. 


"సాధువులను ప్రవహించే నీళ్లతో పోల్చుతారు. అవి ఎక్కడా ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటాయి. సాధువుల ఆలోచనలూ అంతే. కేవలం ఆలోచించడమే కాదు. ఆచరిస్తారు కూడా. నిరంతరం అలా శ్రమిస్తారు కాబట్టే వాళ్లు అలా సాధువులయ్యారు"


- ప్రధాని నరేంద్ర మోదీ