Pawan Kalyan Comments On Pithapuram Development: పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని.. దీన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawankalyan) అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. గొల్లప్రోలులోని (Gollaprolu) బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రతీ విద్యార్థి పేరును అడిగి తెలుసుకుని మరీ కరచాలనం చేశారు. తాను చదువుకునే రోజుల్లో నాయకులు ఎలా ఉండాలి అని ఊహించుకున్నానో.. అలా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.




'విద్యార్ధులు ఎంత బాగా చదువుకుంటే దేశం అంత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఆటస్థలాలు బాగుంటే ఆహ్లాదకర వాతావరణంతో విద్యార్ధులు బాగా చదువుకుంటారు. విద్యార్ధులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. మనసు ఎంత బలంగా ఉంటుందో శరీరం కూడా అంతే బలంగా ఉండాలి. అప్పుడే పరిపూర్ణంగా విద్యాభ్యాసం సాధ్యపడుతుంది. విజువల్ థింకింగ్ మీద దృష్టి సారించాలి. డ్రాయింగ్ స్కిల్స్ బాగుంటే చదివిన చదువు కూడా ఎక్కువగా గుర్తుంటుంది. ఉపాధ్యాయులు మైండ్ మ్యాపింగ్ మీద దృష్టి సారించాలి. అవసరం అయితే మైండ్ మ్యాపింగ్ మీద వర్క్ షాపు నిర్వహించాలి' అని సూచించారు. అన్నారు.




కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు హామీ




విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా పవన్ స్కూల్‌కు ఇంకా సౌకర్యాలేమైనా కావాలని అడగ్గా.. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. వెంటనే ఆయన స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిని పిలిచి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఎన్ని కంప్యూటర్లు కావాలని ఆరా తీశారు. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


అభివృద్ధికి మాస్టర్ ప్లాన్


పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. విద్య, క్రీడలు, శాస్త్ర మరియు సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధన దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతున్నట్లు వెల్లడించారు. ప్రధాన రహదారులతో గ్రామీణ రహదారుల అనుసంధానం చేస్తామని.. రోడ్లపై చెత్త కనిపించకూడదని అన్నారు. గొల్లుప్రోలులో స్కూల్ సైన్స్ ల్యాబ్ ప్రారంభం సహా ఎమ్మార్వో ఆఫీసులో మిగిలిన పనులు, సుద్ధగడ్డ బ్రిడ్జి నిర్మాణం, సూరంపేట గొల్లప్రోలు అప్రోచ్ రోడ్ నిర్మాణం, ఎంపీపీ స్కూల్ అదనపు గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.


Also Read: Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు