Pawan Kalyan :  జనసేన పార్టీ అధినతే పవన్ కల్యాణ్ ఏపీలో వాలంటీర్లు చేస్తున్న డేటా సేకరణ అంశంపై మరోసారి ట్వీట్ చేశారు. ఏపీలో వాలంటీర్లకు బాస్ ఎవరు అని ప్రశ్నించారు. ప్రైవేటు డేటాను సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారు ? అది ప్రైవేటు కంపెనీనా ? ఆ కంపెనీ హెడ్ ఎవరు ? అది ప్రభుత్వ సంస్థనా ? వారికి డేటా కలెక్ట్ చేయాలని ఎవరు చెప్పారు ? చీఫ్ సెక్రటరీనా ? సీఎంనా ? కలెక్టరా ? ఎమ్మెల్యేనా ? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర హోం శాఖ కార్యాలయానికి ట్యాగ్ చేశారు.  






 


వాలంటీర్ డేటా సేకరణపై ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ 


వాలంటీర్లు డేటా సేకరణ చేస్తున్న వాలంటీర్ వీడియోను జనసేన శతఘ్నిం టీమ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో వివరాలు సేకరిస్తున్న వలంటీర్ ను.. వివరాలు చెప్పే వ్యక్తి ఐడీ కార్డు చూపించమని అడిగితే.. గీతం కాలేజీ ఐడీ కార్డు చూపించారు.  జనసేన శతఘ్ని సోషల్ మీడియా పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రజల్లో వాలంటీర్లపై తిరుగుబాటు మొదలయిందని జనసైనికులు ప్రచారం చేస్తున్నారు. 


వాలంటీర్ల పై పవన్ వరుస ఆరోపణలతో వివాదం 


వాలంటీర్లపై పవన్ కల్యాణ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసినప్పటి నుండి వివాదం ప్రారంభమయింది. పవన్ కల్యాణ్..వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని .. ఆయనపై కేసు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమయింది. అదే సమయంలో పవన్ కల్యాణ్ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు. అసలు వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా.. ప్రైవేటు సంస్థకు వెళ్తోందని కొన్ని వివరాలు బయట పెట్టారు. ఎఫ్ వో ఏ అనే సంస్థ నానక్  రామ్ గూడలో ఉందని.. ఆ సంస్థకే సమాచారం వెళ్తోందని..  పైగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆ సంస్థకు డబ్బులు కూడా ఇస్తోందని ఆరోపిస్తున్నారు. 


వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నిస్తున్నందుకు పవన్‌పై వైసీపీ ఎదురుదాడి


మరో వైపు వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్దోంది. ఆయనపై రాజకీయంగా  ఆరోపణలు గుప్పిస్తోంది.  ఈ అంశంపై మంత్రులు పవన్ పై విరుచుకుపడుతున్నారు.  వాలంటీర్లు కూాడా రెండు, మూడు రోజులు నిరసనలు నిర్వహించారు.