NDA 2024 Plan:  వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారం దక్కించుకునేందుకు బీజేపీ చాలానే కష్టపడుతోంది. ఇప్పటి నుంచి అందుకు సంబంధించిన కసరత్తులను కూడా చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎన్నికల్లో గెలిచేందుకు ఏం ఏం చేయాలి వంటి వాటిపై చర్చించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే ఎన్డీఏ ఎంపీలను మొత్తం పది బృందాలుగా విభజించారు. వీరిలో 35 నుంచి 40 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పది బృందాలతో నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రతీ రోజు 2 గ్రూపులతో ప్రధాని మోదీ భేటీ అయ్యేలా ప్లాన్ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారికి విజయ సూత్రాలను అందించనున్నారని సమాచారం. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి, వారి సవాళ్లను ఎలా తిప్పికొట్టాలి వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  


సాయంంత్రం 6.30కి ఒకటి, 7.30కి మరో సమావేశం


ఎంపీలను ప్రాంతీయంగా గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మొత్తం రెండు ప్రాంతాల నుంచి ఎంపీలు ఉంటారు. మొదటి రోజు జూలై 25 ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ మరియు ఈశాన్య ప్రాంత నేతలతో సమావేశమవుతారు. సమావేశాలు రెండు భాగాలుగా జరుగుతాయి. అందులో మొదటిది సాయంత్రం 6:30 గంటలకు, మరొకటి రాత్రి 7:30 గంటలకు. ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్‌ నేత జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు ప్రతి సమావేశానికి హాజరవుతారు. సంజీవ్ బల్యాన్, అజయ్ భట్‌లతో సహా కేంద్ర మంత్రులు, పార్టీ అధికారులు సమావేశాల సమన్వయ ఇన్‌ చార్జులుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరపున జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా ఈ సమావేశాలపై సమన్వయం చేస్తారు. కాగా ఎంపీలు తమ పని తీరుపై నివేదికలు సిద్ధం చేయాలని కోరారు.


భారీ మెజార్టీతో మూడోసారి కూడా మేమే అధికారంలోకి


ఎన్డీయే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. అంతకుముందు జూలై 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో కూటమిలో భాగమైన 39 పార్టీలు సమావేశమయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో పోటీ చేస్తామని.. భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తారని కూటమి ధీమా వ్యక్తం చేసింది. 


ఈ భేటీలో ప్రధాని మోదీ తమ కూటమికి కొత్త అర్థం చెప్పారు. NDAలో ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఆస్పిరేషన్ అని ప్రధాని మోదీ అన్నారు. బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీలో వారి కూటమికి I.N.D.I.A అని పేరు పెట్టుకున్నందున తాజాగా మోదీ ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలకు తాము ఎప్పుడూ స్వాగతం పలుకుతామని ప్రధాని మోదీ చెప్పారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏనే కీలక పాత్ర పోషించిందని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు ఎన్డీఏపై పూర్తి నమ్మకం ఉందని ప్రధాని అన్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial