వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు పెరిగి పోతున్నాయని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఏమాత్రం అమలు కాని దిశ చట్టంపై ప్రచార ఆర్భాటం అవసరమా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. దిశ చట్టంపై ఇంత వరకు ఎంత మందికి శిక్ష వేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు.
మహిళలకు రక్షణ లేదు
ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ నాయకురాలు పరిటాల సునీత అన్నారు. దిశా చట్టం ఇప్పటివరకూ అమలు కాలేదని, అది అసలు చట్టంగా మారలేదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత చెబుతున్నారని గుర్తుచేశారు. ఏపీకి మహిళనే హోం మంత్రిగా ఉన్నప్పటికీ ఏపీలో మహిళలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. సాక్షాత్తూ మహిళనే హోం మంత్రిగా ఉన్నా.. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఏపీలో మహిళలపై జరగుతున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగా అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ, దిశా చట్టంపై ప్రచార ఆర్భాటాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Russian Emergency Minister Demise: కెమెరామెన్‌ను రక్షించిన రష్యా మంత్రి.. అంతలోనే ఊహించని విషాదం..
మహిళలు, బాలికలకు ఏ రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నిస్తే.. అమలులోకి రాని దిశా చట్టం గురించి ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని.. అందుకు నిరసనగా వెంకటాపురంలో టీడీపీ శ్రేణులు, మహిళలతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఏ రాష్ట్రంలోనూ సీఎం ఒక తీరుగా, హోం మంత్రి ఒకరకంగా, డీజీపీ మరో తీరుగా చెప్పరని.. అయితే ఏపీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పరిటాల సునీత అన్నారు. దిశా చట్టంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓ తీరుగా చెబుతుంటే.. హోం మంత్రి, డీజీపీ గౌతమ్ సవాంగ్ మరో తీరుగా దిశా చట్టంపై వ్యాఖ్యలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు.
ఒకవేళ సీఎం జగన్ చెప్పినట్లుగా దిశా చట్టం ఉన్నట్లయితే ఏపీలో ఇప్పటివరకూ ఎన్ని కేసులలో ఎందరికీ ఎలాంటి శిక్షలు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని.. హత్యలు సైతం అధికమయ్యాయని పేర్కొన్నారు. అనవసర హడావుడి మానుకుని ఇప్పటికైనా మహిళలపై దాడులకు తెగబడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
Also Read: నర్సరావుపేటలో టెన్షన్ టెన్షన్ - లోకేష్‌కు పర్మిషన్ లేదన్న పోలీసులు !