అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు ఆదాయపు పన్ను విభాగం అధికారులు పెద్ద షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్లు సమాచారం. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 


అమ్మ సీఎంగా ఉన్నప్పుడు..



  • ఈ ఆస్తులను 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చిన్నమ్మ కొనుగోలు చేశారు. అప్పుడు వీటి విలువ దాదాపు రూ. 20లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

  • 2014లో కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ 11 ఆస్తులను 'ఆదాయానికి మించి ఆస్తులు'గా పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగానే ఐటీశాఖ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


జైలు శిక్ష..


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ. ఆమె మరణానంతరం అన్నాడీంకే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నాలు చేస్తోన్న సమయంలోనే అవినీతి కేసులో శిక్ష పడటంతో జైలుకెళ్లాల్సి వచ్చింది. అవినీతి కేసులో శశికళకు ఇప్పటికే నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది ఆరంభంలో విడుదలయ్యారు. 


అనంతరం జరిగిన పరిణామాల్లో శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ తిరిగి అన్నాడీఎంకేలో చేరతారనే వార్తలు వినిపించినప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు.