కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ను పదవి నుంచి దిపేందుకు అన్ని పార్టీల కార్పొరేటర్లు ఏకమయ్యారు. మేయర్ సుంకర పావని పై 33 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మేయర్ సుంకర పావని తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఆమెపై అవిశ్వాసం పెట్టిన వారిలోఅత్యధిక మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ వేరే. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పి అందర్నీ కూడగట్టి మేయర్‌ను పదవి నుంచి దించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఆమెను పదవి నుంచి దించేందుకు సమయం కలసి రావడంతో 33మంది కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి  కలెక్టర్ సి. హరికిరణ్ కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు..


Also Read : రౌడీయిజం మీదంటే మీది ! ఉండవల్లి ఘటనపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పరస్పర విమర్శలు !


కాకినాడ నగర పాలక సంస్థకు 2018లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 వార్డులు ఉన్నాయి. వీటిలో 48 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీరిలో 2017లో ముగ్గురు మృతి చెందారు. మరొకరు రాజీనామా చేశారు.. దీంతో 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు.  అప్పటి టిడిపి ప్రభుత్వంలో 2017 సెప్టెంబర్ 17న కాకినాడ మేయర్ గా సుంకర పావని ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. శుక్రవారానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రాజీనామా చేసేందుకు మేయర్ పావని అంగీకరించలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నారు.


Also Read : జేసీ వర్సెస్ కాల్వ ! అనంత టీడీపీలో పెరిగిపోతున్న గ్రూపుల గోల !


వైసీపీ కార్పొరేటర్లు 8 మంది, ఇండిపెండెంట్లు ఇద్దరు, బీజేపీ కార్పొరేటర్లు ఇద్దరు, టీడీపీకి చెందిన 21మంది కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వం రెండో డిప్యూటీ మేయర్ పదవిని మంజూరు చేసింది. ఆ పదవికి వైసీపీ కార్పొరేటర్ ఎంపికయ్యారు. ఆయన నేతృత్వంలో కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని.. పాలకవర్గాన్ని సమావేశపర్చాలని కోరారు. త్వరలోనే ప్రిసైడింగ్ అధికారిని ఏర్పాటు చేసి  ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెర వెనుక ఎమ్మెల్యే ద్వారంపూడి ఉండటంతో ఎప్పుడైనా మేయర్ పావనిని పదవి నుంచి దించవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.


మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కుట్రలు చేసి మహిళను మేయర్ పదవి నుంచి దింపేస్తోదని మేయర్ సుంకర పావని విమర్శిస్తున్నారు. తనపై లేనిపోని అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపైనే ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తిరుగుబాటు చేసిన కార్పొరేటర్ల వాదన మరోలా ఉంది. సహచర కార్పొరేటర్లమైన తమకు మేయర్ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఇన్నాళ్లు ఓపికతో భరించామని ఇక భరించలేమని అంటున్నారు. 


Also Read : తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమా ? అధికార పార్టీల కసరత్తు అదే చెబుతోందా ?