ఇటీవల హైదరాబాద్‌లో లవర్ కోసం నవీన్ అనే స్నేహితుడిని హరిహరకృష్ణ అనే యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అలాంటి ఘటనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. కానీ ఇక్కడ హత్య జరగలేదు. కేవలం గొడవ జరిగింది, అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఓ అమ్మాయి ప్రేమ విషయంలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తన ప్రియురాలు వెంటపడుతున్నారన్న అనుమానంతో హర్షవర్ధన్ అనే యువకుడి స్నేహితులను అరవ జయకృష్ణ అనే మరో యువకుడు బెదిరించాడు. పట్టణంలోని భ్రమరాంబ సినిమా థియేటర్ వద్ద హర్షవర్ధన్, అరవ జయకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానిక పోలీసుస్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.




గతంలో వెంకటగిరి పట్టణంలో ఇలాంటి గొడవలు జరిగినా యువకులు ఎప్పుడు ఒకరిపై ఒకరు దాడికి దిగలేదు. గతంలో తన కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న ఓ యువకుడి బైక్ ని తండ్రి కాల్చివేసిన ఘటన వెంకటగిరిలోనే జరిగింది. అయితే ఆ వ్యవహారం తర్వాత తన ప్రేమకోసం ఆ యవకుడు పోలీసులకు కంప్లయింట్ కూడా ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు రెండు వర్గాలు కొట్టుకోవడంతో కలకలం రేగింది.


వెంకటగిరిలో ఇటీవల ఓ డాక్టర్ హత్య కేసు కూడా సంచలనంగా మారింది. ప్రొఫెషనల్ జలసీతో మరో డాక్టర్ అతడిని సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించాడు. తాజాగా ఇప్పుడీ గొడవ వెంకటగిరిలో కలకలం రేపింది. ఒక యువతికోసం ఇద్దరు యువకులు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఇంకొకరు దాడి చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


సినిమా సీన్..


వెంకటగిరిలో రాత్రి జరిగిన ఘటన సినిమా సీన్ ని తలపించేలా ఉంది. ఇద్దరు యువకులు రోడ్డుపైకి రావడం, యాధృచ్ఛికంగా వారిద్దరూ తారసపడినట్టు మాట్లాడుకోవడం, వెంటనే యువతి విషయం ప్రస్తావనకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం సినిమా సీన్ లాగానే ఉంది. ఇద్దరు యువకులు దాడికి దిగడంతో వెంటనే వారి బ్యాచ్ లు కూడా రోడ్డుపైకి వచ్చాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అయితే రాత్రివేళ అందరూ చూస్తుండగానే యువకులు రెండు బ్యాచ్ లు గా విడిపోయి గొడవకు దిగడం సంచలనంగా మారింది.


పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొందరు చెల్లాచెదరైపోయారు. వెంటనే గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రినుంచి వారు పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయికి మరో యువకుడు చూస్తున్నాడనే  అనుమానంతో ఈ గొడవ మొదలైంది. అయితే వారిది కేవలం అనుమానమేనా, ఇద్దరూ నిజంగానే ఒకే అమ్మాయిని ప్రేమించారా, అసలు ఆ అమ్మాయి ఈ ఇద్దరిలో ఒకరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.