వందకు వందమార్కులు వేస్తే పేపర్ ఎంత బాగా రాశారో అనుకోవచ్చు. వందకు రెండొందల మార్కులు వేస్తే పరీక్ష రాసినవారి గురించి కాదు, పేపర్ దిద్దినవారి గురించి ఆలోచించాలి. ఇప్పుడు నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ (VSU) కూడా ఇలాగే వార్తల్లోకెక్కింది. గతంలో డబ్బులు తీసుకుని పరీక్షల్లో పాస్ మార్కులు వేస్తారనే ఆరోపణలు యూనివర్శిటీ సిబ్బందిపై ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వందకు వేల వేల మార్కులు వేసి మరో రకంగా ట్విస్ట్ ఇచ్చారు అధికారులు.
అసలేం జరిగింది..?
ఎనిమిది నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు జరిగాయి. సహజంగా ఈ యూనివర్శిటీలో మూల్యాంకనం, మార్కుల ప్రకటన బాగా ఆలస్యం. ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. VSU పరిధిలో 69 డిగ్రీ కాలేజీలు ఉండగా, 30వేల మంది విద్యార్థులు ఈ సెమిస్టర్ పరీక్షలు రాశారు. ఫలితాలను గత శుక్రవారం విడుదల చేశారు. వాటిని ఆన్ లైన్ లో చూసుకున్న విద్యార్థులు షాకయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా 200మంది ఖంగుతిన్నారు. వెంటనే వారు యూనివర్శిటీకి పరుగులు పెట్టారు.
పరీక్షల్లో ఫెయిలైనా అంతగా కంగారు పడేవారు కాదేమో. వందకు రెండొందల మార్కులు వచ్చే సరికి వారు షాకయ్యారు. అన్ని పరీక్షల్లో కలిపి 800 గరిష్ట మార్కులకు ఓ విద్యార్థికి 5360 వచ్చాయి. మరో విద్యార్థికి 600 మార్కులకు గాను 6138 వేశారు. దీంతో వారంతా వెంటనే యూనివర్శిటీకి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. మార్కులు బాగానే వేశారు కానీ మరీ ఎక్కువయ్యాయని నిలదీశారు.
ఇది కేవలం 200మంది సమస్యే కాదు, అంతకు మించి చాలామందికే ఇలా తప్పులు దొర్లి ఉంటాయి. కానీ శుక్రవారం తర్వాత వరుస సెలవలు ఉండటంతో చాలామందికి రిజల్ట్ విషయం తెలియదు. విద్యార్థులు ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుని మార్కులు చూసుకున్నారు. వెంటనే వారంతా యూనివర్శిటీకి వెళ్లి అధికారులను కలవడంతో వారు ఫలితాలను ఆన్ లైన్ నుంచి తొలగించారు. అంటే అసలు విషయం బయటపడేలోపు దాన్ని కవర్ చేసుకున్నారు.
టెక్నికల్ ఎర్రర్..
దీన్ని టెక్నికల్ ఎర్రర్ అని చెబుతున్నారు యూనివర్శిటీ అధికారులు. 150మందికి ఇలా తప్పుగా ఫలితాలు వచ్చాయని, వాటన్నిటినీ సరిదిద్దామని చెప్పారు. యూనివర్శిటీ పరీక్షల నిర్వహణ అధికారి ప్రభాకర్ ఈమేరకు వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్..
పరీక్షల్లో విద్యార్థులకు తప్పుడు మార్కులు రావడంపై సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే యూనివర్శిటీ అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించడానికి తర్జన భర్జనలు పడ్డారు. అసలు ఆన్ లైన్ లో మార్కులు లేవు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు సర్దిచెప్పి పంపించిన తర్వాత ఈ వ్యవహారం బయటపడేసరికి చివరకు తప్పైపోయినట్టు చెబుతున్నారు. కేవలం సాంకేతిక సమస్య వల్లే ఇలా తప్పుగా మార్కులు ఆన్ లైన్ లో నమోదయ్యాయని, వాటిని తొలగించి కొత్త జాబితా పెడుతున్నామని చెప్పారు.
యూనివర్శిటీ వ్యవహారంపై స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన కూడా ఇదే యూనివర్శిటీ పీహెచ్డీ విద్యార్థి. జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లినట్టు తెలుస్తోంది. దీంత యూనివర్శిటీ అధికారులు హడావిడిపడ్డారు.