భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఇది మరో మేలిమలుపు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే ఇస్రో చేపట్టింది. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపినా, రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే. అంటే పూర్తిగా ఇది ప్రైవేట్ ప్రయోగం. దీనికి కేవలం ఇస్రో లాంఛింగ్ ప్యాడ్ ని మాత్రమే వినియోగిస్తున్నారు.


అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, స్టార్టప్ లకు అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో. దీనిలో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ ఈ రాకెట్‌ను రూపొందించింది. ఇస్రో, ఇన్‌ స్పేస్‌ సహకారంతో రెండేళ్ల కాల వ్యవధిలో దీన్ని సిద్ధం చేశారు. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరుగుతోంది. తొలిసారిగా పంపే రాకెట్ పేరు ప్రారంభ్. ప్రారంభ్‌ పేరుతో విక్రమ్‌-ఎస్‌ రాకెట్లను వరుసగా పంపేందుకు స్కైరూట్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటోంది.




తొలి రాకెట్‌ ద్వారా స్పేస్‌ కిడ్స్‌ ఇండియా (ఇండియా-తమిళనాడు), బజూమ్‌ క్యూ (ఆర్మేనియా), ఎన్‌-స్పేస్‌ టెక్‌ (ఇండియా-ఏపీ)కి చెందిన మూడు పేలోడ్ లను నింగిలోకి పంపిస్తారు.


విక్రమ్ -ఎస్1 రాకెట్ విశేషాలు..


బరువు – 545 కిలోలు
పొడవు – 6 మీటర్లు
పేలోడ్‌ సామర్థ్యం – 83 కిలోలు


ప్రయోగం మొదలయ్యే సమయం 11.30 గంటలు


పూర్తయ్యే సమయం 11.35 గంటలు


విక్రమ్-ఎస్ రాకెట్‌ మొత్తం మూడు చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వీటిలో రెండు భారత్ కు చెందినవి కాగా, మూడోది విదేశీ సంస్థది. ఈ రాకెట్‌ కు సంబంధించిన ఫుల్ డ్యూరేషన్ టెస్ట్‌ మేలో విజయవంతంగా పూర్తి చేశారు. విక్రమ్-ఎస్ ప్రయోగం నవంబర్ 12-16 మధ్య జరగాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈరోజు (నవంబర్ 18)కి వాయిదా వేశారు.


సరిగ్గా ఈ ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదికనుంచి దీన్ని ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం 4 నిమిషాల 50 సెకన్లకు ముగుస్తుంది.


విక్రమ్-ఎస్ రాకెట్ 81.5 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ప్రయాణిస్తుంది. అక్కడ భూ స్థిర కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశ పెడుతుంది. అక్కడినుంచి తిరిగి రాకెట్ సముద్రంలో పడిపోతుంది. శ్రీహరికోటకు 115.8 కిలోమీటర్ల దూరంలో రాకెట్ సముద్రంలో పడిపోతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. జాలర్లను వేటకు వెళ్లకుండా నిషేధించారు.


వాస్తవానికి శ్రీహరికోట షార్ కేంద్రంలో రాకెట్ ప్రయోగం అంటే శాస్త్రవేత్తలు హడావిడిగా కనిపిస్తారు. ఇస్రో చైర్మన్ రాకెట్ నమూనాతో తిరుమల, సూళ్లూరుపేటలోని ఆలయాల్లో పూజలు చేయిస్తుంటారు. కానీ ఈసారి ఆ హడావిడి లేదు. ఇది పూర్తిగా ప్రైవేటు ప్రయోగం. అంటే ప్రైవేటు సంస్థకు కావల్సిన వసతులు మాత్రమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సమకూర్చింది. మిగిలివన్నీ ఆ సంస్థ నిర్వాహకులే ఏర్పాటు చేసుకున్నారు. కేవలం ఆ ప్రాంతంలో పనిచేసే వారు తప్ప మిగిలిన వారిని ఎవరిని రాకెట్‌ ప్రయోగం చేపట్టే సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్స్ కి రానివ్వడంలేదు అధికారులు. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌ షార్‌ కు వచ్చారు.