వంట కోసం తీసుకునే స్టీల్ పాత్రల అడుగున రాగి పూత ఎప్పుడైనా చూశారా. స్టీల్ కంటే రాగి తొందరగా వేడిని గ్రహిస్తుంది, అందుకే వాటి అడుగున ఆ పూత పూస్తారు. సరిగ్గా ఇదే ఫార్ములా ఉపయోగించి మట్టి పాత్రల్లో వంటని సులభంగా, వేగంగా మార్చేశారు నెల్లూరు జిల్లా విద్యార్థులు. కావలి మండలం ఒట్టూరులోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మృణాళిని, సాయి గౌతమ్ దీన్ని తమ ప్రయోగంగా మార్చుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.


మట్టి పాత్రల్లో వంట ఆరోగ్యకరం, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాలక్రంలో వంట వేగంగా అయ్యేందుకు అందరూ లోహపాత్రలవైపు మొగ్గు చూపారు. వంటకే కాదు, శుభ్రం చేసుకోడానికి కూడా సులభంగా ఉండటంతో అల్యూమినియం, స్టీల్ పాత్రలు వంటింట్లో వచ్చి చేరాయి. మట్టి కుండలు మాయమయ్యాయి. అయితే మట్టి కుండలకి కూడా అల్యూమినియం తొడుగు అమరిస్తే వంట వేగంగా కావడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని ఉండదని నిరూపించారు నెల్లూరు జిల్లా విద్యార్థులు.




కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. ఆ క్రమంలో వచ్చిన ఐడియానే ఇది అని అంటారు ఒట్టూరు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయిని బిందు మాధవి. ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తాము ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు తెలిపారు. మట్టి పాత్రల్లో ఇంకా వండుకునేవారు అక్కడక్కడా కనపడతారని, లోహపు పాత్రల్లో వంట వండటం వల్ల ఆ లోహాలు మెల్లమెల్లగా మన శరీరంలోకి చేరుకుని మన శరీరాన్ని విషతుల్యం చేస్తాయని చెబుతున్నారు. మట్టి పాత్రలకి అల్యూమినియం కోటింగ్ ద్వారా వాటి రూపు రేఖలు మార్చి వంటకు ఉపయోగించవచ్చని చెబుతున్నారు.


మన పూర్వీకులు మట్టి పాత్రలతో వంట చేసుకొని తినటం వలన వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాంటి మట్టి పాత్రలను నాగరికత పేరుతో మనం పక్కనపెట్టామని, లోహపు పాత్రలలో వంటలు చేయటం ద్వారా ఆ పదార్థాలలో ఎటువంటి పోషక విలువలు ఉండవని చెబుతున్నారు. లోహపు పాత్రలను ఉపయోగించటంతో కొత్త సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. లోహపు వస్తువులను కరిగించి, మట్టి పాత్రకు క్రింది నుండి సగభాగం వరకు ఉండే విధంగా లోహపు పట్టీ తయారు చేసి వాటితో మట్టి పాత్రను కప్పి ఉంచాలని, వాటితో వంట వండుకుంటే వేగంగా వంట పూర్తవుతుందని చెప్పారు. దీన్ని ప్రయోగం ద్వారా వివరించారు. ఇలాంటి ప్రయోగం ద్వారా తాము చుట్టు పక్కలవారికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తాము కూడా మట్టి పాత్రల్లో వంటకు ఆసక్తి చూపిస్తున్నామని చెప్పారు.


మట్టిపాత్రల అలవాటుకి మళ్లీ తిరిగి వెళ్లాలని చెబుతున్నారు ఈ విద్యార్థులు. అందరికీ ఆదర్శంగా ఉండాలంటే, స్కూళ్లలో కూడా మధ్యాహ్న భోజనం మట్టి పాత్రల్లో వండి వడ్డించాలనే సలహా ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన ఈ విద్యార్థులు, రాష్ట్ర స్థాయిలో కూడా తమ కొత్త ఐడియాతో అందరినీ ఆకట్టుకుంటారని ఆశిద్దాం.