ఒకటో తేదీ ఉదయం 6 గంటలకే పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్తారు. కానీ వారి ఇంటికి మాత్రం వెళ్లరు. రేషన్ బండి ఇంటి వద్దకే వచ్చి సరకులు ఇచ్చి వెళ్తుంది. కానీ వారున్న ఇంటి చుట్టుపక్కలకు మాత్రం రేషన్ వాహనాలు వెళ్లవు. ఇంతకీ ఎవరా శాపగ్రస్తులు. వారికి ఈ సౌకర్యాలు ఎందుకు లేవు..?
వారేమీ శాపగ్రస్తులు కాదు, లబ్ధిదారులు. టీడీపీ హయాం నుంచి టిడ్కో ఇళ్ల కోసం వేచి చూసీ చూసీ ఇన్నాళ్లకు ఆ ఇళ్లను అందుకున్న అదృష్టవంతులు. ఒకరకంగా మిగతా ఊరికి దూరంగా వచ్చేశారు వారంతా. ఊరి చివర టిడ్కో ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది కానీ, వారికి అక్కడ సౌకర్యాల కల్పన మాత్రం ఆలస్యం అవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పంపిణీ జోరందుకుంది. ఈ ఏడాది చివరినాటికి 2.62 లక్షల ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుతం 300 చదరపు అడుగుల ఇళ్లను, అంటే సింగిల్ బెడ్ రూమ్ లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తోంది. కేవలం రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలు ఆయా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తారు. అయితే గతంలోనే లబ్ధిదారులంతా 500 రూపాయలు జమచేసి ఉన్నారు. వారంతా ఇప్పుడు గృహప్రవేశాలు చేశారు. కానీ ఊరికి దూరంగా, విసిరేసినట్టు ఉండే టిడ్కో అపార్ట్ మెంట్ల వద్ద ప్రజలు నివశించడానికి ఇబ్బందిపడుతున్నారు.
ప్రతి నెలా వాలంటీర్లు ఒకటో తేదీనే పింఛన్ దారుల ఇంటికి వెళ్లి వారికి డబ్బులు అందజేస్తారు. కానీ టిడ్కో ఇళ్లకు ఎవరూ రారు, లబ్ధిదారులే వాలంటీర్లను వెదుక్కుంటూ వారి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక నెల నెలా రేషన్ తీసుకోవడం కూడా విరికి కష్టమే. చాలామంది టిడ్కో ఇళ్లలో చేరిన తర్వాత రేషన్ తీసుకోలేకపోతున్నారు. మూడు నెలలుగా తాము రేషన్ తీసుకోలేదని చెబుతున్నారు కొంతమంది.
టిడ్కో ఇళ్ల సమీపంలో ఎక్కడా షాపులు పెట్టేందుకు అనుమతివ్వలేదు అధికారులు. గతంలో చిల్లర దుకాణాలు పెట్టుకుని ఉపాధి పొందేవారు, ఇప్పుడు టిడ్కో సముదాయంలోకి వచ్చాక ఆ వ్యాపారాన్ని కొనసాగించలేకపోతున్నారు. తమ ఉపాధి పోయిందని వారు బాధపడుతున్నారు. 4 ఫ్లోర్లు ఎక్కాలంటే కష్టంగా ఉందంటున్న కొందరు లబ్ధిదారులు జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే తమకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల సముదాయాలు ఊరికి చివరిగా ఉంటున్నాయి. సరైన రవాణా సౌకర్యాలు ఉండటం లేదు. బస్సు సౌకర్యే లేనిచోట్ల, ఆటోలను ఆశ్రయించాలంటే 100 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. వీలైనంత త్వరకా టిడ్కో ఇళ్లను మంజూరు చేసి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు లబ్ధిదారులు.
టిడ్కో గృహ సముదాయాల్లో 300 చదరపు అడుగుల ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అందిస్తోంది. 365 చదరపు అడుగుల ఇళ్లకు లబ్ధిదారుని వాటా రూ.25వేలు కాగా, రూ.3.15 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. 430 చదరపు అడుగుల ఇళ్లకు లబ్ధిదారుని వాటా రూ.50వేలు కాగా, బ్యాంకు రుణం రూ.3.65 లక్షలు రుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం వ్యయంలో లబ్ధిదారులు 75 శాతం నిధులు చెల్లిస్తే వారి పేరిట ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయిస్తుంది ప్రభుత్వం. ఓవైపు టిడ్కో ఇళ్ల మంజూరు ప్రారంభం కాగా, మరోవైపు మిగిలిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ. 4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని చెబుతున్నారు నాయకులు. 2.62 లక్షల ఇళ్ల ప్రాథమిక నిర్మాణం పూర్తయింది. అయితే, భూసేకరణ పెండింగ్‌లో సహా సాంకేతిక సమస్యల కారణంగా మిగిలిన 2.4 లక్షల ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.