కరోనా తర్వాత రవాణా వ్యవస్థలో చాలా మార్పులొచ్చాయి. భారత రైల్వే కూడా కరోనా కాలంలో నష్టాలను ఎదుర్కొంది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే రైళ్ల క్రమబద్ధీకరణతో సాధారణ పరిస్థితులొస్తున్నాయి. అయితే కరోనా కాలంలో చాలా చోట్ల ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని కూడా కేవలం రిజర్వేషన్ టికెట్లపైనే నడిపారు. ఇప్పుడిప్పుడే కరెంట్ బుకింగ్ కూడా మొదలైంది. అయితే గతంలో క్యాన్సిల్ అయిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి పునరుద్ధరించకపోవడంతో కొన్ని చోట్ల రైల్వే స్టేషన్లు నిరుపయోగంగా మారాయి. రైల్వే స్టేషన్ ఉంటుంది, ప్లాట్ ఫామ్ ఉంటుంది, టికెట్ కౌంటర్ ఉంటుంది. కానీ అక్కడ ఏ రైలూ ఆగదు, ప్రయాణికులు ఉండరు, ఉద్యోగులకు పనే ఉండదు. నెల్లూరు జిల్లాలో ఇలాంటి రైల్వే స్టేషన్లు 3 ఉన్నాయి. 


విజయవాడ- గూడూరు మధ్య మూడో రైల్వే లైను ఏర్పాటు ఇటీవలే పూర్తయింది. ప్రత్యేకంగా గూడ్స్, ఇతర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకోసం ఈ డెడికేటెడ్ లైన్ ని ఉపయోగిస్తారు. ఈ  లైను ఏర్పాటు వల్ల అన్ని రైల్వే స్టేషన్లలో కొత్త భవనాలు నిర్మించారు. దీంతో చిన్న చిన్న స్టేషన్లకూ మహర్దశ వచ్చింది. అయితే స్టేషన్ ని అందంగా ముస్తాబు చేసినా, ఆ స్టేషన్లో రైళ్లు ఆగకపోవడం మాత్రం విచిత్రం అనే చెప్పాలి. 


కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో భక్తుల రాకపోకల కోసం శ్రీ వెంకటేశ్వరపాళెం రైల్వే స్టేషన్‌ ఏర్పడింది. ఆమధ్య రైల్వే స్టేషన్ భవనం శిథిలమైపోగా.. దాన్ని తొలగించి.. విశాలమైన రెండు అంతస్తుల భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫుట్‌ ఓవర్‌ బిడ్రి, ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడ ఒక్క ప్యాసింజర్‌ రైలు కూడా ఆగదు. గతంలో రోజుకి ఆరు ప్యాసింజర్ రైళ్లు ఆ స్టేష్లో ఆగేవి. స్వామి దర్శనంకోసం వచ్చే భక్తులు, ఇతర అవసరాలకోసం వచ్చేవారు ఈ రైల్వే స్టేషన్ ని ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లన్నీ క్యాన్సిల్ అవడంతో అసలు స్టేషన్ ఎందుకూ పనికి రావడంలేదు. 


నెల్లూరు జిల్లాలో ఇలా నిరుపయోగంగా ఉన్న రైల్వే స్టేషన్లు మరికొన్ని ఉన్నాయి. జిల్లాలోని అల్లూరు రోడ్డు, తలమంచి, రైల్వే స్టేషన్లలో కూడా ప్రస్తుతం ఒక్క ప్యాసింజర్ రైలు కూడా ఆగదు. 


కరోనా తర్వాత ఇలా..
కరోనా కారణంగా గతంలో ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లన్నీ ఒకేసారి రద్దయ్యాయి. కొవిడ్ తగ్గాక ఇప్పుడు క్రమక్రమంగా ఎక్స్ ప్రెస్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను కూడా పట్టాలెక్కించినా, నెల్లూరు జిల్లాలో మాత్రం ప్యాసింజర్లు నడవడంలేదు. దీంతో ప్యాసింజర్లు మాత్రమే ఆగే రైల్వే స్టేషన్లు అసలు రైళ్ల సందడి, ప్రయాణికుల రాకపోకలు లేక వెలవెలబోతున్నాయి. 


విజయవాడ నుంచి ప్యాసింజర్ ట్రైన్స్ ఏవీ..? 
విజయవాడ- గూడూరు, గూడూరు-రేణిగుంట మధ్య గతంలో ఓ ప్యాసింజర్ ట్రైన్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఎక్స్ ప్రెస్ చేశారు గతంలో ఉన్న మరో ప్యాసింజర్ ని కూడా ఎక్స్ ప్రెస్ చేసి టికెట్ రేట్లు పెంచి స్టాపింగ్స్ తీసేశారు. దీంతో కేవల్ ప్యాసింజర్ ట్రైన్స్ కోసం ఉన్న రైల్వే స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఆయా ఊళ్లలోని ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు ఆయా ప్రాంతాల ప్రయాణికులు.