ఒంగోలులో అమావీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం జరిగిన ఇష్యూ సోషల్ మీడియా పుణ్యమా అని హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఓ గిరిజన యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టి నోటిలో మూత్ర పోషిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. 


ఒంగోలులో మోటా నవీన్, మన్నె రామాంజనేయులు స్నేహితులు. వీళ్లు కలిసి కట్టుగానే చాలా నేరాలు చేశారు. వీరిపై పదుల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీరిలో నవీన్‌ మాత్రమే పలుమార్లు జైలుకు కూడా వెళ్లివచ్చాడు. రామాంజనేయులు మాత్రం ఒక్కసారిగా కూడా పోలీసులకు చిక్కలేదు. 


ఈ మధ్య కాలంలో నవీన్‌, రామాంజనేయుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. ఉన్నట్టుంది ఓ రోజు నవీన్‌ను రామాంజనేయులు వచ్చి తీసుకెళ్లాడు. మందు తాగుదామని చెప్పి ఒంగోలు లోని కిమ్స్‌ ఆసుపత్రి వెనకాలకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ రామంజనేయుల స్నేహితులు ఉన్నారు. 


మొత్తం పది మంది కలిసి జాలీగా మందుతాగారు. ఈ క్రమంలోనే పాత గాయాలను రాంజనేయులు రేపాడు. ప్లాన్ ప్రకారం తన చుట్టూ ఉన్న వాళ్లు కూడా దానిపై ఆజ్యం పోశారు. దీంతో వివాదం ముదిరింది. నవీన్, రామాంజనేయులు మధ్య తగాదా మొదలైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే ఫుల్‌గా మందు తాగిన వారంతా ఇద్దర్ని వారించాల్సింది పోయి మరింత రెచ్చగొట్టారు. 


మందు తాగిన మైకంలో ఏం చేస్తున్నామో తెలియకుండానే నవీన్‌పై తొమ్మిది మంది కలిసి దాడి చేశారు. రక్తాలు వచ్చేలా కొట్టారు. వదిలేయాలని ప్రాధేయపడ్డా విడిచిపెట్టాలేదు. అతని నోట్లో మూత్ర పోశారు. ఇంకా చెప్పలేని రాయలేని పనుల చాలానే చేశారు. బాధితులు ఎంత మొరపెట్టుకున్నా వాళ్లు మాత్రం కనికరించలేదు. 


ఈ పైశాచికత్వాన్ని కొందరు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అవ్వడంతో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఫిర్యాదు అందుకున్న పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. కానీ వారిలో ఎవర్నీ అరెస్టు చేయలేదు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం నమోదు చేశారు. 


ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎమ్మెల్యే అనుచరుడు ఒకడు ఓ వ్యక్తిపై మూత్రం పోయడం సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. దీనిపై అక్కడి ముఖ్యమంత్రే స్పందించాల్సి వచ్చింది. బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పారు.