ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పార్టీలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వర్గాన్ని పోలీసులు లాకప్ లో వేసి చితకబాదడంతో వ్యవహారం రచ్చకెక్కింది. ఎస్సై రవిబాబు చేతిలో దెబ్బలు తిన్న సూళ్లూరుపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కళత్తూరు సునీల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు. ఎస్సై తనను చంపాలని చూశాడని, తమకు న్యాయం చేయాలన్నారు. సునీల్ రెడ్డికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి తన అనుచరులతో పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అందరూ వైసీపీ నేతలే అయినా పోలీసుల లాఠీ దెబ్బలు మాత్రం తప్పించుకోలేకపోయారు.


స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఓ వ్యూహం ప్రకారం తమని టార్గెట్ చేశారని అంటున్నారు వైరి వర్గం నేతలు. సంజీవయ్య వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం రౌడీషీటర్లను కౌన్సెలింగ్ కి పిలిచామని, వారే తమపై తిరగబడ్డారని అంటున్నారు. షర్ట్ కాలర్ పట్టుకుని, కులంపేరుతో తనని దూషించారంటున్నారు ఎస్సై రవిబాబు. ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం నాయకులంతా ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉన్నారు. 


వర్గ పోరు..
సూళ్లూరు పేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ కిలివేటి సంజీవయ్య వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వైసీపీలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలతో సంజీవయ్యకు విభేదాలున్నాయి. దీంతో వారు మరో పవర్ సెంటర్ కోసం ప్రయత్నిస్తున్నారు. సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి ఎమ్మెల్యే వ్యతిరేక కూటమిలో ఉన్నారు. ఆయన మద్దతుదారుడైన కోఆప్షన్ సభ్యుడు సునీల్ రెడ్డిని పోలీసులు కొట్టారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై పోలీస్ స్టేషన్ కి వచ్చి గొడవ పెట్టుకున్నారు శ్రీమంత్ రెడ్డి. ఎస్సై రవిబాబు కావాలనే తమని టార్గెట్ చేశారంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందంటూ ఆరోపించారు. కావాలనే ఎమ్మెల్యే వర్గం తమని టార్గెట్ చేసిందని, కేసుల పేరుతో వేధిస్తోందని అంటున్నారు శ్రీమంత్ రెడ్డి. 


దాడి కేసులో పెద్ద ట్విస్ట్..
పోలీసులు తనపై దాడి చేశారనేది వైసీపీలో ఓ వర్గం నాయకుల వాదన. కానీ పోలీసులపైనే సదరు కోఆప్షన్ సభ్యుడు దాడి చేసి కులం పేరుతో దూషించాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో సునీల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఎస్సీ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ నాయకులు ఆందోళనకు దిగారు. 




దళిత సంఘాల ఆగ్రహం..
ఎస్సై షర్ట్ కాలర్ పట్టుకుని కులం పేరుతో దూషించడమే కాకుండా తనపైనే దాడి చేశారంటూ వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైసీపీ నాయకులు సునీల్ రెడ్డి, శ్రీమంత్ రెడ్డి, శేఖర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ వారు సూళ్లూరుపేట పట్టణంలో ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వరించారు. ఎమ్మార్వో ఆఫీస్ లో వినతిపత్రం అందించారు. పోలీస్ స్టేషన్లో కూడా వినతిపత్రం అందించారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. ఇప్పిటకే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని, సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.