ఈనెల 26 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు కాబోతోంది. మే 29 వరకు మ్యాచ్ లు ఉంటాయి. క్రికెట్ లవర్స్ కి ఇది ఎంతో ఇష్టమైన సీజన్. అటు కరోనా భయాలు లేవు, ఇటు సమ్మర్ సీజన్, దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్కడితో సీన్ అయిపోలేదు. ఐపీఎల్ అంటే క్రికెట్ బెట్టింగ్ ముఠాకు హాట్ కేక్. దాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోడానికి దగుల్బాజీ బ్యాచ్ లు సిద్ధంగా ఉంటాయి. గతంలో నెల్లూరు జిల్లాలో ఓ భారీ క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అప్పట్లో బెట్టింగ్ మాఫియాకి రాజకీయ రంగు కూడా పులిమారు. బెట్టింగ్ మాఫియాకి నెల్లూరు జిల్లాకి చెందిన యువత కూడా బలైన ఉదాహరణలున్నాయి. ఇప్పుడు ఐపీఎల్ అంటే కచ్చితంగా బెట్టింగ్ జరిగే అవకాశముంది. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిసారించారు నెల్లూరు జిల్లా పోలీసులు.
క్రికెట్ బెట్టింగ్ ని అరికట్టేందుకు స్పెషల్ టీమ్..
బెట్టింగ్ మాఫియా పని పట్టేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. యువతను టార్గెట్ చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దీనిపై ఇటీవలే అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ విజయరావు. ప్రజలు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. అవగాహనతోనే ఆన్ లైన్ నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. గతంలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ముద్దాయిల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశాలిచ్చారు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎందరో జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు ఎస్పీ విజయరావు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడొద్దని, ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని ఆయన యువతకు సందేశమిచ్చారు.
సెబ్ అధికారులతో కలసి..
మరోవైపు గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకం, అక్రమ రవాణా ని అరికట్టే విషయంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులతో కలసి దాడులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ఎస్పీ. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ రైడ్ నిర్వహించి మెరుపు దాడులు చేయాలని సూచించారు. అంతర్ రాష్ట్ర, జిల్లాల తనిఖీ కేంద్రాలు వద్ధ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. గంజాయి, ఖైనీ, గుట్కా వంటి నిషేధిత ఉత్పత్తుల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. గుట్కా, గంజాయి, మాదకద్రవ్యాలు వంటి మత్తుపదార్ధాల బారిన పడితే జీవితం సర్వనాశనం అవుతుందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఎస్పీ.
సమాచారం ఇవ్వండి.. నేరాల నియంత్రణలో భాగస్వాములు కండి..
గుట్కా అక్రమ రవాణా లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే డయల్100 కి తెలియజేయాలని కోరారు ఎస్పీ. లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. కుదరని పక్షంలో పోలీస్ PRO మొబైల్ నెంబర్ 9704594540 కి కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు ఎస్పీ.