ఆమధ్య వెంకటగిరిలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాల్సిందేనంటూ డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెనక్కి తగ్గినట్టు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లాలో కలపకపోయినా కనీసం వెంకటగిరి కేంద్రంగా ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి కొత్త ప్రతిపాదన ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి. 




ఎందుకీ వెనకడుగు..? 
ఆమధ్య ఆనం రామనారాయణ రెడ్డి మూడు మండలాల విషయంలో తీవ్రంగా పట్టుబట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది. పునర్విభజన తర్వాత.. తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలోకి  వెంకటగిరి వెళ్లిపోతుంది. దీంతో ఆనం అభ్యంతరం తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనేది ఆయన ప్రతిపాదన. ఆమేరకు జిల్లాల పునర్విభజనపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అసంబద్ధంగా విభజన ప్రక్రియ జరిగిందని అన్నారు. ఓ దశలో మూడు మండలాల ప్రజలతో కలసి ఆయన నిరాహార దీక్షల్లో కూడా పాల్గొన్నారు. 


మారిన సమీకరణాలు.. 
ఆనం ఊపు చూస్తే.. ఏదో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారేమోనని అనిపించింది. కానీ ఇప్పుడా వేడి చల్లారినట్టుంది. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపే వరకు ఊరుకునేది లేదని తెగేసి చెప్పిన ఆనం రామనారాయణ రెడ్డి.. ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గారు. మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. జిల్లాల పునర్విభజపై అభ్యంతరాల స్వీకరణకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటం.. నెల్లూరు జిల్లా అభ్యంతరాలపై విజయవాడలో బుధవారం కీలక సమీక్ష జరగబోతుండటంతో ఆనం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుని కలిసి కొత్త ప్రతిపాదన ఆయన ముందుంచారు. కొత్తగా ఏర్పడే బాలాజీ జిల్లాలో వెంకటగిరి కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా చేస్తే వెంకటగిరి ప్రాంతాలకు పరిపాలనా పరమైన సౌలభ్యం.. ఉంటుందని చెప్పారు. 


వెంకటగిరి మున్సిపాల్టీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల ప్రజల, ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలను ఆయన జిల్లా కలెక్టర్ కి అందించారు. రెవెన్యూ డివిజన్ కు సానుకూలంగా స్పందించాలని కోరారు. జిల్లాల పునర్విభజన సమీక్షలో ఈ విషయాలను ప్రస్తావించాలన్నారు. 


గతంలో జిల్లా విభజనతో సాగునీటి సమస్యలొస్తాయని ప్రస్తావించారు ఆనం రామనారాయణ రెడ్డి. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల విషయంలో నీటి తగాదాలు జరుగుతాయని, రైతులు తగాదా పడతారని, తీవ్ర పరిణామాలుంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఇబ్బందులన్నీ సమసిపోతాయంటున్నారు ఆనం.