ఏపీలో జిల్లాల పునర్విభజనపై జనవరి 26వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు సమర్పించేందుకు గడువు ఇచ్చింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లానుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించేందుకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి కొన్నిటిని పరిగణలోకి తీసుకుంది. మరికొన్నిటిని పక్కనపెట్టింది. ఈ అభ్యంతరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ పోర్టల్’లో అప్‌లోడ్ చేస్తున్నారు అధికారులు.
గూడూరుపైనే గురి..
జిల్లాల పునర్విభజనతో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న గూడూరు నియోజకవర్గం బాలాజీ జిల్లాకు వెళ్లిపోతుంది. కానీ గూడూరు వాసులందరికీ నెల్లూరు జిల్లా కేంద్రం బాాగా దగ్గరగా ఉంటుంది. తిరుపతి వెళ్లాలంటే వారికి కష్టం. దీంతో వారంతా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలని కోరుకుంటున్నారు. దీనిపైనే ఎక్కువగా వినతులు వచ్చినట్టు చెబుతున్నారు అధికారులు. గూడూరు నుంచి నెల్లూరుకు 40 కిలోమీటర్లు ఉండగా తిరుపతి 100 కిలోమీటర్లు దూరం ఉందని, ఇదే అతి పెద్ద సమస్య అని ఆ ప్రాంతవాసులు అభ్యంతరాల్లో తెలియజేస్తున్నారు. మరోవైపు సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాలను కూడా నెల్లూరులోనే ఉంచాలని అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక వెంకటగిరి సమస్య తెలిసిందే. ఆ నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని ఇటీవల స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మరో ప్రతిపాదనతో ముందుకొచ్చారు. గూడూరుని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని, కందుకూరుని నెల్లూరులో కలపకుండా, ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారాయన.
మార్చి 2న సమీక్ష..
ఇప్పటికే జిల్లాలపై వస్తున్న అభ్యంతరాలపై ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. పరిమితంగా జిల్లాలపై వీరు సమాచారం సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లాపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 2న విజయవాడలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన రాష్ట్రస్థాయి కమిటీలో ప్లానింగ్ సెక్రటరీ, సెక్రటరీలు సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అభ్యంతరాలు ఆరోజున తెలుస్తాయి.
నీటి వనరుల విభజనకు సంబంధించి ఇప్పటికే జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించారు అధికారులు. స్వర్ణముఖి, కండలేరు, పెన్నా పరివాహక వ్యవస్థలపై సంబంధిత అధికారులతో చర్చించారు. సోమశిల ప్రాజెక్టు ఒకవైపు నెల్లూరు జిల్లా, మరోవైపు బాలాజీ జిల్లాలోకి వస్తుంది. దీని నుంచి అటు కండలేరుకు, ఇటు దక్షిణ కాలువకు నీటి విడుదల కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నీటి విడుదలలో ఇబ్బందులు రాకుండా చర్యలు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాల విభజనపై వచ్చిన అభ్యంతరాలపై రేపు కొంతమేర స్పష్టత వచ్చే అవకాశముంది.