Nellore Man Murder Case: నెల్లూరు నగరం చెముడుగుంట హైవే వద్ద ఆటో సగం కాలి ఉంది. అందులో ఓ వ్యక్తి శవం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించడం కలకలం రేపుతోంది. నెల్లూరు నగరం సమీపంలోని చెముడుగుంట పంచాయతీ పరిధి పవన్‌ కాలనీ ఊరికి దూరంగా ఉంటుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్నా.. మనుషుల సంచారం తక్కువ. దీంతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఆటోలో వచ్చి మందు తాగే బ్యాచ్ లు, ఇతరత్రా వ్యసనాలకు అలవాటైనవారు నేరుగా హైవే ఎక్కి ఇక్కడకు వస్తుంటారు. గతంలో పోలీస్ పహారా పెంచినా కూడా ఇటీవల కాలంలో మళ్లీ ఇవి అలవాటైపోయాయి. 


పవన్ కాలనీ శివారులో నేషనల్ హైవే వద్ద ఓ ఆటో తగలబడిపోయి ఉంది. స్థానికులు సగం కాలిన ఆటోని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన చెముడుగుంటకు వచ్చారు. కాలిపోయిన ఆటో అందులో శవం.. పోలీసులకు మిస్టరీగా మారింది. అయితే ఆటో నెంబర్ మాత్రమే వారికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో లభించిన చిన్న క్లూ. దాని ఆధారంగా ఈ కేసు ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


అసలేం జరిగింది..?
చెముడుగుంట హైవే వద్ద ఆటో సగం కాలి ఉంది. అందులో ఓ వ్యక్తి శవం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. కనీసం ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. పూర్తిగా శవం తగలబెట్టి, ఇక ఆధారాలు దొరకవు అని తేలిన తర్వాతే హంతకులు అక్కడినుంచి వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. హైవే పక్కన మంట వస్తే ఎవరూ పెద్దగా అనుమానించరు కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆటోతో ఎప్పటికైనా ప్రమాదం అని తెలిసే ఉంటుంది. అందుకే ఆటోని కూడా దొందిలించుకు వచ్చి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. 


ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఏకైక ఆధారం ఆటో నెంబర్. AP26TF0464 నెంబర్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఆటోలో చనిపోయి ఉన్న వ్యక్తి వయసు 40 సంవత్సరాలు ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఎలాంటి గుర్తులు కానీ, ఆనవాళ్లు కానీ లేవు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఎవరైనా మిస్ అయ్యారా. వారి వివరాలు పోల్చి చూసేందుకు అని ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఇది బయటపడింది. దీంతో ఆయా రోజుల్లో నగరం నుంచి హైవేకి దారి తీసే వాహనాల సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. 


ఇటీవల కాలంలో నెల్లూరులో ఇలాంటి ఘటనలు జరిగిన ఉదాహరణలున్నాయి. గతంలో కూడా నెల్లూరు నగర శివార్లలో ఓ కుర్రాడిని హత్య చేసి ఆటోలో వదిలి వెళ్లారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణం అని ఆ కేసుని ఛేదించారు పోలీసులు. ఆమధ్య నెల్లూరు నగరానికి చెందిన ఓ జిరాక్స్ షాప్ యజమాని, కారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు తానే కారులో ఉండి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన కూడా వాహనం, అందులో శవం.. అనే తరహాలోనే ఉంది. హత్య చేసి శవాన్ని ఆటోలో పెట్టి తగలబెట్టారు దుండగులు. పోలీసులకు సవాల్ విసిరారు. 


Also Read: Vizag Bike Racing : విశాఖలో అర్ధరాత్రి బైక్ రైడర్స్ హల్ చల్, సైడ్ ఇవ్వమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి