Amarnath Yatra Tragedy: అమర్ నాథ్ లో ఆకస్మిక వరదల కారణంగా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ నుంచి అమర్ నాథ్ కు వెళ్లినవారిలో 20 మంది ఆదివారం సురక్షితంగా సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా విజయవాడకు వచ్చారు, అక్కడినుంచి సొంత ప్రాంతాలకు వెళ్లారు. మరో 18 మంది ఈరోజు ఉదయం రైలులో చండీగఢ్ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
34 మంది గల్లంతు..
అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాల్లో 29 మంది యాత్రికులు ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు ఏలూరు, తణుకు, ఉండ్రాజవరం, రాజమండ్రికి చెందినవారు కూడా అమర్ నాథ్ లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
అమర్ నాథ్ యాత్రలో వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తమ రాష్ట్రం నుంచి ఎవరెవరు యాత్రకు వెళ్లారు, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారాలేంటి అనే విషయాలను అధికారులు ఆరా తీశారు. ఏపీకి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అప్రమత్తంచేశారు సీఎం జగన్. అమర్ నాథ్ యాత్రకు వెళ్లినవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు రెవెన్యూ అధికారులు. వారి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లకోసం ట్రై చేస్తున్నారు. కొంతమంది తమ బంధువులు క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు. వరదలు రాకముందే వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారని ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. మరికొందరు మాత్రం వరదల కారణంగా గల్లంతయ్యారని తెలుస్తోంది. బంధువులు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, కొంతమంది ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఇక్కడివారు ఆదుర్దా పడుతున్నారు.
గల్లంతయ్యారా..? లేక..?
సహజంగా ఇలాంటి సందర్భాల్లో సిగ్నల్స్ లేకపోవడం, చార్జింగ్ లేక ఫోన్ స్విచాప్ కావడంతో.. ఫోన్ కాంటాక్ట్ లు ఉండవు. అయితే ఇప్పుడు పరిస్థితి అదేనే లాక ప్రమాదం ఏదైనా జరిగిందా అని ఇక్కడి బంధువులు ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. రాజమండ్రికి చెందినవారు గల్లంతయ్యారని అనుకున్నా.. ఆ తర్వాత వారు సురక్షితంగానే ఉన్నారని తేలింది. మరి ఇప్పుడు ఆచూకీ తెలియని 34 మంది సంగతేంటి..? వీరిలో అందరూ క్షేమమేనా..? లేక ఎవరికైనా ఇబ్బంది జరిగిందా అనేది తేలాల్సి ఉంది.
నెల్లూరులో క్షణం క్షణం..
అమర్ నాథ్ లో చిక్కుకుపోయిన వారిలో నెల్లూరు జిల్లావారే ఎక్కువగా ఉండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. బంధువుల సమాచారం తెలియనివారు నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు వస్తారని భరోసా ఇస్తున్నారు.