నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కిడ్నాప్ ఎపిసోడ్ ని పోలీసులు 24 గంటల లోపు ఛేదించారు. సినిమా స్టైల్ లో ఓ వడ్ల దళారిని కిడ్నాప్ చేసిన ఏడుగురు కిడ్నాపర్లు.. అతడిని కారులో ఎక్కించుకుని తన్నుకుంటూ తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతని వద్ద బంగారం ఉంగరం, నగదు దోచుకున్నారు. అక్కడితో ఆగలేదు. ఏటీఎం కార్డు లాక్కుని, పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బులు డ్రా చేశారు. ఆ డబ్బుతో ఫూటుగా మద్యం తాగి కారులోనే తమ గమ్యానికి బయలుదేరారు. కొడవలూరు మండలం అల్లిమడుగు సంఘం గ్రామానికి వెళ్తున్న క్రమంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో హోమ్ గార్డ్ లు వారిని అడ్డుకుని అసలు విషయం ఆరా తీశారు. కారులో కిడ్నాప్ కి గురైన వ్యక్తి ఉండటంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వడ్ల దళారి సుధాకర్ రావు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి, మిల్లులకు అమ్ముతూ వారి వద్ద డబ్బు తీసుకుని రైతులుక తిరిగి చెల్లించేవాడు. ఈ క్రమంలో ఓ రైతుకి అతను దాదాపు 9 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. ఎంతకీ బాకీ ఇవ్వకపోవడంతో రైతు అతడిపై కక్ష పెంచుకున్నాడు. అతడ్ని కిడ్నాప్ చేసి 9 లక్షలు వసూలు చేయాలని, అందుకు లక్షన్నర రూపాయల సుపారీ ఇస్తానంటూ ఏడుగురు వ్యక్తులతో బేరం కుదుర్చుకున్నాడు. ఆ ఏడుగురు వ్యక్తులు దారికాసి ఓ వివాహ విందు కోసం వెళ్తున్న సుధాకర్ రావుని అడ్డుకుని కిడ్నాప్ చేశారు. కొడవలూరు మండలంలోని ఓ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి 9 లక్షలు వసూలు చేయాలనుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కారు.
కిడ్నాప్ చేయడానికి సుపారీ ఇచ్చిన వ్యక్తి, అతనికి సలహా ఇచ్చిన మరో వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. గొడవలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ గా వాటిని పరిష్కరించుకోవాలని, అంతే కాని.. ఇలా కిడ్నాప్ లు, బెదిరింపులకు పాల్పడటం నేరం అవుతుందని తెలిపారు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి. ఈ కేసుని ఛేదించడంలో చొరవ చూపిన హోమ్ గార్డ్ లు, ఎస్సైలకు ఆయన ప్రోత్సాహకాలు అందించారు. పోలీసులు సాధారణ చెకింగ్ లలో భాగంగా కారు పత్రాలు చూసి వదిలేయకుండా.. అందులో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారని ఆరా తీయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. ఈ విషయంలో చొరవ చూపిన హోమ్ గార్డ్ లను డీఎస్పీ అభినందించారు.
ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కిడ్నాప్ చేసే క్రమంలో వడ్ల దళారి సుధాకర్ రావుని నిందితులు తీవ్రంగా గాయపరిచినట్టు తెలిపారు. ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరికోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కిడ్నాప్ లో పాల్గొన్న ఏడుగురు నిందితులను రిమాండ్ కి తరలించారు.
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి