ఒమిక్రాన్ కు మందు రెడీగా ఉందని, 48 గంటల్లో దాన్ని నయం చేస్తానంటూ ప్రకటించిన ఆనందయ్యకు మరోసారి ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆనందయ్య సొంత ఊరిలో ఆందోళన మొదలైన మరుసటి రోజే ప్రభుత్వం ఆయనకు నోటీసులు ఇచ్చింది. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ తరపున ఆనందయ్యకు నోటీసు జారీ చేశారు. ముత్తుకూరు మండల తహశీల్దార్ సోమ్లా నాయక్ ఆనందయ్యకు ఈ నోటీసు అందించారు. డ్రగ్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ ప్రకారం మందు తయారీ, పంపిణీకి ఆయుష్‌ శాఖ నుంచి అనుమతి ఉందా అంటూ ఈ తాఖీదులో ప్రశ్నించారు. ఒకవేళ అనుమతి ఉంటే కలెక్టరేట్‌ కు వచ్చి వివరణ ఇవ్వాలని సూచించారు. ఆనందయ్య రెండు రోజుల్లో వచ్చి వివరణ ఇస్తానని చెప్పారు.


గతంలో కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చిన మందుపై కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆయుష్ శాఖ సహా.. ఇతర అధికారులు దాని నాణ్యతను పరిశీలించారు. ఆనందయ్య మందు ఆరోగ్యానికి ఏమాత్రం హానికరం కాదని వారు నిర్థారించారు. తన మందులో వ్యాధి నిరోధకశక్తి మూలికలు ఉన్నాయని ఆయుష్‌ శాఖ నిర్ధారించిందని, ఒమిక్రాన్‌ కు ఇచ్చే మందులోనూ ఇలాంటి మూలికలు ఉన్నాయని అంటున్నారు ఆనందయ్య. 


స్థానికులనుంచి వ్యతిరేకత ఎందుకు..?
గతంలో ఆనందయ్య మందు పంపిణీ చేసిన సమయంలో స్థానికులు కొన్ని ఇబ్బందులు పడ్డారు. కరోనా రోగులు, వారి బంధువులు కృష్ణపట్నంకు పోటెత్తారు. ఐసీయూ బెడ్ పై ఉన్న రోగుల్ని కూడా కొంతమంది ఆనందయ్య మందుకోసం ఆ ఊరికి తెచ్చారు. ఈ దశలో కరోనా రోగుల వల్ల తమకు ఇబ్బందు కలుగుతోందని కృష్ణపట్నం వాసులు ఆందోళన వెలిబుచ్చారు. మరోసారి అలాంటి దశ వస్తుందేమోనని ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. 


కృష్ణపట్నం పంచాయతీ తీర్మానం.. 
ఆనందయ్య మందుపై గ్రామ పంచాయతీ తాజాగా, అత్యవసర సమావేశం నిర్వహించింది. కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని ఆనందయ్యకు వ్యతిరేకంగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అయితే, తన మందు కోసం ప్రజలు ఎందుకు వస్తున్నారో వాళ్లనే అడగాలని అంటున్నారు ఆనందయ్య. తన మందు వల్ల ప్రయోజనం ఉంటుందే కానీ, ఎవరికీ ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు. 


నోటీసులతో ఏమవుతుంది..? 
ఆనందయ్యకి జాయింట్ కలెక్టర్ నోటీసులివ్వడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆనందయ్య మందుని ప్రభుత్వం అడ్డుకుంటుందా లేదా సజావుగా పంపిణీ సాగుతుందా అనేది సందిగ్ధంలో పడింది. రెండు రోజులలోగా వివరణ ఇస్తానంటున్న ఆనందయ్య.. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..


Also Read: వాషింగ్ మెషిన్‌లో ఇంటి తాళాలు.. అయినా దర్జాగా చోరీ చేసి, అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే..?  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి