కొంతమంది ఇంటికి తాళం వేసి తమ వెంట తీసుకెళ్తుంటారు. భార్యా భర్యలిద్దరూ చెరో పనికి వెళ్లేటప్పుడు కొన్నిసార్లు తాళం ఏదో ఒక చోట పెట్టి గుర్తు చెప్పుకుంటారు. లేదా రెండు తాళం చెవిలు చెరొకరి దగ్గర పెట్టుకుంటారు. కానీ నెల్లూరు జిల్లా కావలిలోని మొగిలి కోటేశ్వరరావు దంపతులకు తాళం చెవి ఇంటి పరిసరాల్లోనే పెట్టి వెళ్లిపోవడం అలవాటు. అలా వారికి అలవాటైన చోటు వాషింగ్ మిషన్. ఇంటికి తాళం వేసి, బయట ఉండే వాషింగ్ మిషన్లో తాళం చెవి పెట్టి వెళ్తుంటారు. ముందు ఎవరు ఇంటికి వచ్చినా దాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. అయితే ఈ అలవాటుని గమనించిన వారికి తెలిసిన వ్యక్తి ఇంటికి కన్నమేశాడు. ఎంచక్కా తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ తాళం చెవి తిరిగి వాషింగ్ మిషన్లోనే పెట్టడంతో దంపతులకు అనుమానం రాలేదు. ఆ తర్వాత డబ్బులు, నగదు పోయాయని తెలుసుకుని లబోదిబోమన్నారు.
నెల్లూరు జిల్లా కావలిలోని బాలక్రిష్ణారెడ్డి నగర్ కాలనీలో ఈనెల 24వ తేదీన జరిగిన దొంగతనం జరిగింది. ఇంటికి వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ బీరువాలో నగలు, నగదు మాయమయ్యాయి. ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు రోజుల వ్యవధిలోని నిందితుడ్ని పట్టేశారు. తెలిసినవారి పనిగా గుర్తించి పాలకీర్తి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 9 సవర్లకు పైగా నగలు, యాభైవేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కి తరలించారు.
నిందితుడు రాజేష్.. ఆ ఇంటివారికి బాగా పరిచయస్తుడే. కొన్నిసార్లు వారు తాళం చెవి ఎక్కడ పెట్టి వెళ్లేదీ గమనించాడు. అయితే తెలివిగా కొంతకాలం వేచి చూసి తన పథకం అమలు చేశాడు. తాళం చెవిని వాషింగ్ మెషీన్ నుంచి తీసుకుని నేరుగా ఇంటి తలుపు తీశాడు. ఆ తర్వాత స్క్రూ డ్రైవర్ తో బీరువా తలుపులు తెరిచి నగదు, నగలు దోచేశాడు. తిరిగి వెళ్లేటప్పుడు బీరువా ఎలా ఉందో, అలాగే ఉంచాడు. అంతే కాదు. బయటకొచ్చి ఇంటికి తాళం వేశాడు. ఆ తాళాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్లీ వాషింగ్ మిషన్లో పెట్టాడు.
ఇంటికి తిరిగొచ్చిన కోటేశ్వరరావు దంపతులకు మొదట అనుమానం రాలేదు. వాషింగ్ మిషన్లో పెట్టిన తాళం పెట్టినట్టే ఉంది. కానీ బీరువాలో నగలు మాయమయ్యాయి. దీంతో వారు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీరు చెప్పిన వివరాలతో ఇది కొత్తవారి పని కాదని తెలిసిన వారి చేతివాటమని నిర్థారణకు వచ్చారు. బాగా తెలిసినవారే ఇలా కాపు కాసి తాళం చెవి తీసుకుని దర్జాగా దొంగతనానికి పాల్పడ్డారని అనుమానించారు. దొంగతనం జరిగినప్పటినుంచి రాజేష్ వీరి ఇంటికి రావడంలేదు. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో అతనిపై నిఘా పెట్టారు. చివరకు పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టే సరికి నగలు, నగదు ఎక్కడ ఉందీ బయటపెట్టాడు రాజేష్. ఇంటికి తాళం వేసినప్పుడు అది తమతోపాటే తీసుకెళ్లాలని, ఇంట్లో ఏదో ఒక చోట పెట్టి వెళ్లడం సరికాదని కావలి పోలీసులు చెబుతున్నారు. అలా చేస్తే దొంగలకు మనమే తాళం ఇచ్చినట్టవుతుందని అంటున్నారు.