అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల మూడు రోజులపాటు కురిసిన వర్షాలతో ఏపీ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడింది. ముఖ్యంగా తూర్పు రాయలసీమ జిల్లాల్లో కోత దశకు వచ్చిన పంట చేతికి వచ్చేలోగా నాశనమైంది. నెల్లూరు జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే.. 17 లక్షల టన్నుల వరకు దిగుబడులు లభిస్తాయి. జిల్లాలో ప్రస్తుతం 40 శాతం మాత్రమే కోతలు జరిగాయి. ప్రస్తుతం కోత కోయాల్సిన 60 శాతం పంటలో అత్యధికంగా నెల్లూరు మసూరా రకం ఉంది. అకాల వర్షాలకు ఈ పంట దెబ్బతిన్నది. పంట దెబ్బతినడంతో దళారీలు రంగంలోకి దిగారు. ధరను తెగ్గోస్తున్నారు. దీంతో రైతులు చేసేదేమీ లేక, అందినకాడికి దళారులకు పంటను తెగనమ్ముతున్నారు. వర్షాలకు ముందు కోత కోసిన రైతులు, ధాన్యాన్ని నిల్వ చేసుకునే దిక్కులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు ధాన్యం మొలకెత్తడంతో పూర్తిగా నష్టపోయారు. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి,మండలాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. పంట పొలాల్లో నీరు చేరి ధాన్యం తడిచి రంగు మారి కుళ్ళిపోతుంది. మూడేళ్ల ముందు ఎండాకాలం ముందు ఇలాంటి వర్షాలే పుట్టి ముంచాయని, మళ్లీ ఇప్పుడు అదే తరహాలో వర్షాలు నష్టపరిచాయని అంటున్నారు రైతులు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి(850 కేజీలు)కి రూ.17,500. అయితే ఈసారి దీనికంటే బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉంది. పుట్టికి రూ.20 వేలు ధర పలుకుతుండటంతో అందరూ బయట దళారులకే అమ్ముతున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల్లో భయం మొదలైంది. కళ్లముందే కొంతమంది రైతుల ధాన్యం తడిసిపోయి అల్లాడిపోతుండటంతో మిగతావారు భయపడిపోతున్నారు. దీంతో మిల్లర్లు, దళారులు రంగంలోకి దిగారు. గంట గంటకూ ధర తగ్గించేస్తున్నారు. ప్రస్తుతం పుట్టి రూ.16,500 చొప్పున కొనుగోలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం.. ధాన్యం నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు విక్రయించుకునే వెసులుబాటు అన్నదాతలకు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.
నెల్లూరు జిల్లాలో తొలి పంట సాగు చేసిన రైతులు ఇప్పటికే కష్టాలు అనుభవిస్తున్నారు. అకాల వర్షం వారి పాలిట శాపంగా మారింది. వ్యాపారులు, దళారులు, మిలర్లకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకునేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇంకా జిల్లాలో జరగలేదని ఆరోపిస్తున్నారు రైతులు. శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీపర్పస్ గోదాములను నిర్మిస్తోంది. వీటి నిర్మాణం కూడా నిదానంగా సాగుతోంది.
నెల్లూరు జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాల్లో కోతకొచ్చిన వరి పైరు వాలిపోయింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో 129 గ్రామాల్లో పంట దెబ్బతిన్నది. వరి 3,597.6 హెక్టార్లు, శనగ 600 హెక్టార్లు, పత్తి 252 హెక్టార్లు, నువ్వులు 22 హెక్టార్లు, వేరుశనగ 20 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. ఈ అంచనాలను జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. నెల్లూరు జిల్లాలో ఆదివారం 2.82 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అయితే కురిసిన కాసేపు వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అత్యధికంగా బోగోలులో 7.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైతులు తీవ్రనష్టాలపాలయ్యారు. వరితోపాటు మామిడి పంటకు కూడా నష్టం వాటిల్లింది.