ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగు వద్ద వరదబాధితుల్ని కాపాడబోయి ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. అదే జిల్లాలో విధి నిర్వహణలో తాజాగా మరో ఉద్యోగి చనిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కొడవలూరు మండలం ఎల్లాయపాలెం బిట్-1 సచివాయలయంలో సజ్జా వెంకటేష్ వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.
ఎప్పటిలాగే శనివారం ఉదయం విధులకు వెళ్లిన వెంకటేష్ సాయంత్రం తిరిగి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే జోరుగా వర్షం పడుతోంది. కోవూరు నుంచి గుమ్మల్లదిబ్బలోని తన నివాసానికి వెళ్తున్నాడు వెంకటేష్. అయితే మార్గమధ్యంలో కలుజు వరద ప్రవాహానికి వెంకటేష్ కొట్టుకుపోయాడు. ఇంటికి తిరిగొస్తాడనుకున్న వ్యక్తి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సోషల్ మీడియాలో వెంకటేష్ ఆచూకీ కోసం సమాచారం పోస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్ కోసం రెండ్రోజులపాటు తీవ్రంగా గాలించారు.
Also Read: Weather Updates: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు కురిసే ఛాన్స్
వరదనీటిలో కొట్టుకుపోయాడా, లేక చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లాడా, వర్షాలకు కరెంటు లేక ఫోన్ చార్జింగ్ అయిపోయి స్విచాఫ్ అపోయిందా అని అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అయినప్పటికీ వెంకటేష్ జాడ కనిపించలేదు. చివరకు ఈరోజు వెంకటేష్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నేటి ఉదయం కోవూరు కేఎస్ఎన్ కాలేజీ సమీపంలో వెంకటేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటు సాయంతో తిరివీది దిబ్బ వరకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. కోవూరు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించి వెల్ఫేర్ అసిస్టెంట్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.
6 నెలల క్రితం వివాహం...
వెల్ఫేర్ అసిస్టెంట్ సజ్జా వెంకటేష్ అందరితో కలుపుగోలుగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. సచివాలయం ఉద్యోగాలు పర్మినెంట్ అవుతున్నాయని సంతోషించిన సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల కిందటే అతనికి వివాహం అయింది. కొత్త కాపురం కలతలు లేకుండా సాగిపోతున్న క్రమంలో భారీ వర్షాలు, వరదలు వారి జీవితంలో విషాదం నింపాయి. శనివారం విధులు ముగించుకుని త్వరగా ఇంటికి వెెళ్లి కుటుంబ సబభ్యులను కలుసుకుందామనుకున్న తొందరలో వరదను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లాడు వెంకటేష్. దీంతో వరద నీటిలో కొట్టుకుపోయాడు.
Also Read: Kadiri Incident: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి
అక్కడ ఎవరూ గమనించకపోవడంతో వెంకటేష్ ఏమయ్యాడో కూడా తెలియలేదు. అయితే పోలీసులు మాత్రం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వెంకటేష్ వరదనీటికి కొట్టుకునిపోయి ఉంటాడని అనుమానించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వెంకటేష్ బతికే ఉంటాడని, ఎక్కడైనే చిక్కుకుపోయి ఉంటాడని చివరి వరకు ఎదురు చూశారు. తీరా చివరకు అతని మరణ వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్