అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. అయితే కదిరిలో అంత పెద్ద ఘటన జరిగితే జిల్లా కలెక్టర్ గానీ, ఇతర ఉన్నతాధికారులు కనీసం అటువైపు కూడా వెళ్లకపోవడం దురదృష్టకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కనీసం రెండో రోజైనా కదిరిలో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి బాధితులకు సాయం చేయాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు.
కొందరు మునిసిపాలిటీ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో భవనాలు కూలిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాయలసీమలో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రైతుల ధాన్యం సైతం తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతలు రాయలసీమలో వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలలో సోమవారం పర్యటించనున్నారు.
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా రాయలసీమలో నష్టపోయిన ప్రాంతాలలో సోమవారం బీజేపీ పార్టీ రాష్ట్ర నేతలు బృందం పర్యటించనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వీరితో పాటు మరికొందరు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలా నష్టపోయిన వారికి పెద్ద ఎత్తున పరిహారం ప్రకటించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: నాలుగు జిల్లాలపై వరద ప్రభావం... పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు... 24 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటన
ఆరుకి పెరిగిన మృతులు..
అనంతపురం జిల్లా కదిరిలోని పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. శిథిలాలు పక్కనే ఉన్న రెండు భవనాలపై పడ్డ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి పెరిగిందని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి కొందర్ని రక్షించారు.