దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల మీద ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ప్రభాతంలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపటి నుంచి రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
దక్షిణ కోస్తాంద్రలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత వారం రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమలో నేడు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజులపాటు సీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read: Nellore Mayor Election: నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా పొట్లూరి స్రవంతి..
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని, అంతా చల్లగా ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు సైతం హైదరాబాద్‌లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ఏపీలో ముఖ్యంగా రాయలసీమను వర్షాలు ముంచెత్తాయి. వాటి ప్రభావంతో ఇప్పటికీ కొన్ని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలు నేటికి నీళ్లలో ఉండిపోయాయి. సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ నేడు రాయలసీమకు రానున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయడానికి వీరిని రప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్