మాండూస్ తుపాను అల్లకల్లోలం సృష్టించినా, నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ముందస్తు జాగ్రత్తల వల్లే తుపాను నష్టాన్ని కూడా నిలువరించగలిగామని అన్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. జిల్లాలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. నెల్లూరు బ్యారేజీని సందర్శించి ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీటి ప్రవాహన్ని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరినారాయణ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు, సంగం బ్యారేజీల ద్వారా విడుదలైన వరద నీటి ప్రవాహం గురించి కలెక్టర్ కి వివరించారు.
మాండూస్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని 38 మండలాల్లో సగటున 18 సెంమీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో 28 సెంమీల వర్షపాతం, అత్యల్పంగా కలిగిరి మండలంలో 7 సెంమీల వర్షపాతం నమోదయింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు వరద నీటి ప్రవాహన్ని అంచనా వేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. సోమశిల నీటిని కూడా విడతల వారీగా సముద్రంలోకి వదులుతూ తీరప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి రెండు బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఒక బృందం నెల్లూరులో మకాం వేశాయి, రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాయి. దాదాపు 2800 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించి అన్ని రకాల సదుపాయాలు కల్పించారు అధికారులు.
వర్ష భయం ఉంది..
తుపాను తీరం దాటినా.. దాని ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని, రాబోయే రెండు రోజులు మత్స్యకారులు సముద్రం లోకి వెళ్ళవద్దని సూచించారు అధికారులు. ఈనెల 12 తేదీ అర్ధరాత్రి వరకు నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఇరిగేషన్ కాలువలకు, చెరువులకు పడిన గండ్లు పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయానికి సంబంధించి దాదాపు 5 వేల హెక్టర్లలో నారుమడి దశలో వరిపంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. పూర్తిగా నీరు పోయాక ఆయా రైతులకు అవసరాన్నిబట్టి 80 శాతం సబ్సిడీ పై విత్తనాలు సరఫరా చేస్తామని, రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పంట నష్టం జరిగిన వారికి వెంటనే నష్టపరిహారం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
సోమశిల ప్రాజెక్టు నుండి 38 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైందని, జిల్లాలోని 780 చెరువులు నిండాయని, రాబోయే వ్యవసాయ సీజన్ కు పుష్కలంగా నీరు లభించిందన్నారు అధికారులు. తుపాను ధీటుగా ఎదుర్కోవడంలో గ్రామ సచివాలయ సిబ్బంది సేవలు బాగున్నాయని అన్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వాహిస్తామని, శానిటేషన్ డ్రైవ్, పశు వైద్య శిబిరాలు కూడా నిర్వాహిస్తామన్నారు.