Nellore Candle Rally Protest: ఎన్నికల ప్రచారంలో తలలు నిమిరి, బుగ్గలు తమిడిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఆడవారిపై అత్యాచారాలు జరుగుతుంటే.. ఎక్కడికిపోయారని నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. ఉన్మాది పాలనలో ఆడబిడ్డలకు ఊరూర ఉరితాడులే అనే పేరుతో మహిళా నేతలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. స్థానిక వీఆర్సీ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. తల్లి విజయమ్మను, చెల్లెలు షర్మిలను ఇతర రాష్ట్రానికి పంపించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల ఏపీలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. రాబోయే ఎలక్షన్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి బుద్ధి చెప్తే గానీ మహిళలకు రక్షణ ఉండదని అన్నారు.
ఏపీలో వరుస అఘాయిత్యాలు..
ఏపీలో ఇటీవల కాలంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఉన్మాది పాలనలో ఆడబిడ్డలకు ఊరూరా ఉరితాడులే అనే పేరుతో ప్రతి జిల్లాలోనూ ఈ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు. దిశ చట్టం తీసుకొచ్చినా దానివల్ల ఫలితం లేదని, సాక్షాత్తూ మహిళా వాలంటీర్లు సైతం లైంగిక దాడులు, అత్యాచార బాధితులుగా మారుతున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తర్వాత కొత్త హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలను కూడా వారు ప్రస్తావించారు. అఘాయిత్యాలకు కారణం వారి తల్లుత పెంపకమే అన్నట్టుగా వనిత మాట్లాడారని, ఇలాంటివి జరగడం సహజమేనంటూ వ్యాఖ్యలు చేయడం ఏపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అంటున్నారు.
ఆమధ్య విజయవాడ ఆస్పత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం, ఆ తర్వాత ఓ మహిళ హత్య, ఇటీవల ఓ బధిర యువతిపై అత్యాచారం.. ఇలా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించారు టీడీపీ నేతలు. దిశ చట్టం తీసుకొచ్చినా అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగడంలేదని అంటున్నారు. దీనికి కొనసాగింపుగా మరో పుస్తకం అచ్చు వేయిస్తున్నట్టు తెలిపారు టీడీపీ మహిళా విభాగం నేతలు.
రాష్ట్రంలో జరుగుతున్న దుర్ఘటనలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారాయి. టీడీపీ నేతల వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని, అలాంటి దుర్ఘటనలకు వారే కారణం అంటూ సాక్షాత్తూ సీఎం జగన్ కూడా ఇటీవల ఆరోపించారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసలు నేరస్తులను శిక్షించండ చేతగాక.. తమపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. తాజాగా వైసీపీని నేరుగా టార్గెట్ చేస్తూ ఇలా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితేనే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగవుతాయని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగిపోతాయని, దుర్ఘటనలకు కళ్లెం పడుతుందని అంటున్నారు.