నెల్లూరు జిల్లాలో సూక్ష్మ కళాకారులకు కొదవ లేదు. ఎంత పెద్ద వస్తువుల్నయినా చిన్నవాటిగా మార్చేయడం వారికి అలవాటు. మనుబోలు మండలం యాచవరం గ్రామంలో రాము ఆచారి అనే కళాకారుడు కూడా ఎంత పెద్ద వస్తువుల్నయినా చిన్నగా మార్చాస్తాడు. స్వతహాగా రాము ఆచారి కార్పెంటర్. చెక్కతో అద్భుతంగా వివిధ వస్తువుల్ని తయారు చేస్తాడు. ఆ క్రమంలో ఆయన దృష్టి సూక్ష్మ కళాఖండాలవైపు మళ్లింది. దీంతో ఇలా తన వృత్తితోపాటు ప్రవృత్తితో కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.
గాజు సీసా కనిపిస్తే చాలు..
సూక్ష్మ కళాఖండాలు అందరూ చేస్తుంటారు. అయితే అందులోనూ కాస్త వెరైటీ కోరుకున్నారు రాము ఆచారి. గాజు సీసా కనిపిస్తే చాలు దాన్ని శుభ్రం చేసి అందులో ఏదైనా వస్తువుని ఇరికించేస్తాడు. అసలీ వస్తవు సీసాలోకి ఎలా వెళ్లింది అనే విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే రాము ఆచారికి మాత్రం అలాంటి పని కొట్టినపిండి.
వస్తువు మొత్తాన్ని ఒకేసారి సీసాలోకి పంపించడం కష్టం. అయితే ఒక్కో విడి భాగాన్ని సీసాలోకి పంపించడం సులువు. అలా ముందు విడి భాగాలన్నిటినీ సీసాలోకి పంపించి వాటిని అక్కడ జతచేస్తారు. అలా లోపలే పెద్ద కళాఖండం ఏర్పడుతుంది.
అగ్గిపెట్టెలో క్యాలెండర్.
వేలి గోరుపై నిలబడేంత ఇడ్లీ కుక్కర్, అగ్గిపెట్టెలో పట్టెంత క్యాలెండర్.. ఇలా రాము ఏది చేసినా వెరైటీయే. పెద్ద పెద్దగా ఉండాల్సిన వస్తువులన్నీ మరుగుజ్జు రూపంలోకి మారిపోయి వింతగా కనిపిస్తుంటాయి. చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే తాను ఈ కళను కొనసాగిస్తున్నానని చెబుతుంటారు రాము ఆచారి. ప్రభుత్వం సాయం చేస్తే తన కళను పదిమందికి నేర్పుతానని నమ్మకంగా చెబుతున్నారు.
మట్టిలో మాణిక్యం..
వాస్తవానికి రాము ఆచారి పని కార్పెంటర్. ఆయన కొయ్య పని చేస్తేనే జీవనాధారం. ఇలా గాజు సీసాలో బొమ్మలు చేస్తే ఆయనకు పైసా ఆదాయం రాదు. కానీ ఆదాయం కోసం చూడకుండా.. కేవలం తన జిజ్ఞాసను మెరుగు పరుచుకునేందుకు, పదిమంది గుర్తించేందుకు మాత్రమే ఇలాంటి కళాఖండాలు తయారు చేస్తున్నారు రాము ఆచారి. ప్రతిఫలం ఆశించకుండా ఈ ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు.
lso Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
Also Read: Corona Cases: ఏపీలో కొత్తగా 95 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఒకరు మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి