Atmakur By Election to be held On 23 June 2022: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ ఇక్కడ గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రచార బరిలోకి దింపింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విక్రమ్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు. 


ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
నామినేషన్ల ప్రారంభం   మే 30, 2022
నామినేషన్ల చివరి తేదీ  జూన్ 6, 2022
ఎన్నికల తేదీ    23 జూన్,2022
కౌంటింగ్, ఫలితాల ప్రకటన   26 జూన్, 2022


ప్రచారంలో ముందున్న విక్రమ్ రెడ్డి 
ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో అధికార వైసీపీ స్పీడ్ గా ఉంది. అభ్యర్థి పేరుని అధికారికంగా ప్రకటించడం లాంఛనమే అయినా ముందుగానే మేకపాటి విక్రమ్ రెడ్డి పరిచయ కార్యక్రమాల పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి దగ్గరుండి మరీ విక్రమ్ రెడ్డిని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఒకరకంగా విక్రమ్ రెడ్డి ప్రచారంలో ముందున్నారనే చెప్పాలి. 


ఇక బీజేపీ తరఫున మేకపాటి కుటుంబానికి బంధువైన బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రవీంద్రనాథ్ రెడ్డి తనని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకున్నా... పార్టీనుంచి అలాంటి ప్రకటన ఏదీ అధికారికంగా విడుదల కాలేదు. మరణించినవారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి టీడీపీ సంప్రదాయాన్ని పాటీస్తూ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. ఇక జనసేన కూడా ఇటీవల బద్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో దింపలేదు, ప్రచారానికి రాలేదు. సో.. ఇక్కడ ప్రస్తుతానికి ద్విముఖ పోరు తప్పనిసరి అనిపిస్తోంది. ఇక చిన్నా చితకా పార్టీలు కూడా ఆత్మకూరు బరిలో నిలబడాలనే ఉత్సాహంతో ఉన్నాయి. 



దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలివి..
పంజాబ్ లోని సంగూర్ లోక్ సభ స్థానం, ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్, అజాంఘడ్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే త్రిపురలో నాలుగు చోట్ల, ఢిల్లీలోని రాజేందర్ నగర్, జార్ఖండ్ లోని మందర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతుంది. ఏపీ విషయానికొస్తే.. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఉప ఎన్నికల విషయంలో కూడా రాజకీయాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైసీపీ వర్సెస్ బీజేపీగా ఉన్న రాజకీయాలు.. ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 


Also Read: MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !


Also Read: Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !