ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్లు తగ్గించడం వల్ల వారి రెమ్యునరేషన్‌ కూడా తగ్గుతుందని హీరోలు బాధపడుతున్నారని మంత్రి అనిల్ అన్నారు. భీమ్లా నాయక్‌, వకీల్‌ సాబ్‌ వంటి సినిమాలకి పెట్టిన ఖర్చు ఎంత? పవన్‌కల్యాణ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలని ఉద్దరిస్తానన్న పవన్‌ కల్యాణ్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా అని అన్నారు. పవన్‌ కల్యాణ్ తన క్రేజ్‌ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. మంత్రి అనిల్‌ నెల్లూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమకు ఏ నానీలు తెలియదని.. తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరని సెటైర్లు వేశారు.


Also Read: Bigg Boss 6 Telugu Announced: ఓటీటీలో ‘బిగ్ బాస్-6’: బాలకృష్ణ హోస్టింగ్‌పై స్పందించిన నాగార్జున


‘‘ఒకప్పుడు నేను కూడా బైక్‌ అమ్మి పవన్‌ కల్యాణ్‌కి కటౌట్‌లు కట్టాను. ఉన్న డబ్బులు అన్ని అవ్వగొట్టుకున్నా. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే. ప్రొడక్షన్‌ కాస్ట్‌ 30 శాతం అయితే రెమ్యునరేషన్‌ 70 శాతం ఉంది. సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయి. దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారం పడేలా సినిమా రేట్లు పెంచమని అనడం ఎంతవరకు కరెక్టు. సినిమా విషయంలో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమా హీరోలకి ఎందుకు అంత కడుపుమంట.’’ అని మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు.


మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో ఏపీలో సినిమా టికెట్ ధ‌రల అంశంపై విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు ఏపీ ప్రభుత్వాన్ని స‌మ‌ర్థిస్తుంటే, మరి కొంద‌రు హీరో నానిని, సినీ పరిశ్రమను స‌మ‌ర్థిస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నారు.


నాని కామెంట్స్ ఇవీ..
టికెట్ రేట్లు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించిందని హీరో నాని వ్యాఖ్యానించారు. టికెట్ రేటు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని అంటూనే.. థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని నాని నర్మగర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్‌లో టీ రేటు పది రూపాయలు ఉంది. సినిమా టికెట్ రేటు అంత కంటే తక్కువ అని, మూడు గంటలు కూర్చోబెట్టి సినిమా చూపిస్తే 5 రూపాయలు ఏంటని సాధారణ ప్రేక్షకులు కూడా నోరెళ్ల బెడుతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు కొంత మంది బాహాటంగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకులు అందరికీ తక్కువ రేటులో వినోదం అందుబాటులోకి తీసుకు రావడం కోసమే టికెట్ రేట్లు తగ్గించామని అంటోంది.


Also Read: Shyam Singha Roy Movie Review - 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?


Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి