మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపించనుంది. ఎల్లుండి (ఫిబ్రవరి 23) మేకపాటి అంత్యక్రియలను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 22) ఉదయం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తీసుకువెళ్లనున్నారు. నేడు సాయంత్రం వరకూ అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గౌతమ్‍ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఆయన రేపటికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లుండి మేకపాటి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మేకపాటి హఠాన్మరణం నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


సీఎం నివాళులు
మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు. సీఎం జగన్‌ను చూసి గౌతమ్‌ రెడ్డి తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతో పాటు గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని కూడా సీఎం జగన్ ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు గౌతమ్‌ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి ఆయనకు నివాళి అర్పించారు. ఆయన ఆకస్మిక మరణం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఉదయం జిమ్‌కు వెళ్లాల్సిన ఆయన అస్వస్థతకు గురయ్యారని అన్నారు. మేకపాటి తండ్రి రాజమోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి తాను చూస్తున్నానని అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.


మేకపాటి వారం రోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన ఇండియన్ ఎక్స్ పోకి వెళ్లారు. నిన్ననే (ఫిబ్రవరి 21) తిరిగి వచ్చిన తర్వాత నిన్న ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఉదయం జిమ్‌కు వెళ్లేందుకు సిద్ధం కానుండగా.. వెంటనే ఆయనకు అస్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచారు. మేకపాటికి ఇప్పటికే రెండుసార్లు కరోనా సోకింది. పోస్ట్ కొవిడ్ లక్షణాలు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చేందుకు దారి తీశాయా అని అనుమానిస్తున్నారు.


Also Read: In Pics: మేకపాటి చివరి పర్యటన ఇదే, దుబాయ్‌లో ప్రముఖులతో - ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు