నెల్లూరు రూరల్ మేయర్ తాజా ప్రెస్ మీట్ లో ఈరోజు ఆయన పక్కన నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి కూర్చున్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లకు మేయర్ భర్త కూడా వచ్చారు, కానీ తొలిసారి మేయర్ ని కూడా పక్కన కూర్చోబెట్టుకుని రూరల్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టారు. తనతోపాటు ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని పరోక్షంగా అందరికీ గుర్తు చేశారు. తాజా ప్రెస్ మీట్లో మేయర్ స్రవంతి కూడా మీడియాతో మాట్లాడారు..


ఈ క్షణమే రాజీనామా..


తన భర్త విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారని, ఆ తర్వాత నెల్లూరు మేయర్ పదవి రిజర్వేషన్లో తనకు వచ్చేలా సాయపడ్డారని, కార్పొరేటర్ గా తన గెలుపుకి కోటంరెడ్డి కృషి చేశారని అన్నారు. అలాంటి అన్నను తాను వదిలిపెట్టుకోనని చెప్పారు. తాము ఎప్పటికీ కోటంరెడ్డి వెంటే ఉంటామన్నారు. ఆయన రాజీనామా చేయాలని చెబితే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. బాధతో కాదు, సంతోషంగా తన పదవికి రాజీనామా చేస్తానన్నారు మేయర్ పొట్లూరి స్రవంతి.


అధిష్టానానికి షాక్..


నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కార్పొరేషన్ కి సంబంధించి 26మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ దఫా రూరల్ కి మేయర్ పదవి ఇచ్చి, సిటీ నియోజకవర్గానికి చెందిన రూప్ కుమార్ యాదవ్ కి డిప్యూటీ మేయర్ పదవి అప్పగించారు. అప్పటి వరకు గృహిణిగా ఉన్న పొట్లూరి స్రవంతి తన భర్త అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. రూరల్ ఎమ్మెల్యే చలవతో మేయర్ అయ్యారు. అప్పటినుంచి ఆ కుటుంబానికి మేయర్ దంపతులు కృతజ్ఞతతోనే ఉన్నారు. తాజాగా కోటంరెడ్డి వైసీపీని వీడిపోవడానికి సిద్ధం కావడంతో మేయర్ కూడా ఆయన వెంటే నడుస్తామన్నారు.


నాకు ఫోన్లు చేయొద్దు..


కోటంరెడ్డితో కాకుండా, పార్టీతోనే ఉండాలని తనకు చాలామంది ఫోన్లు చేస్తున్నారని, వారందరూ ఇకపై తనకు ఫోన్లు చేయొద్దని, బహిరంగంగానే తాను కోటంరెడ్డి వర్గంలో ఉన్నానని చెబుతున్నానని అన్నారు మేయర్ స్రవంతి. అంతే కాదు, తాను పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఆమె కాస్త గట్టిగానే అధిష్టానానికి షాకిచ్చినట్టయింది. ఈ వ్యవహారంపై వైసీపీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.


నెల్లూరు రాజకీయాలే ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ గా ఉన్నాయి. వరుస ప్రెస్ మీట్లతో నాయకులు ఆ వేడిని మరింత పెంచుతున్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎంతమంది కార్పొరేటర్లు వైసీపీతో ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యే వైపు వెళ్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఎమ్మెల్యే మాత్రం కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు తనతోపాటు ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. ఎవరెవరు ఏ సమస్యలతో తనను వీడిపోయినా ఎన్నికలనాటికి అందరూ తన దగ్గరకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు మాత్రం అందరూ తనతోపాటే ఉంటారని ఆ నమ్మకం తనకు ఉందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. కోటంరెడ్డి ప్రెస్ మీట్లో మంత్రి కాకాణి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివర్లో మీడియాతో మాట్లాడిన మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా చేస్తానంటూ వైసీపీకి షాకిచ్చారు. ఆమెతోపాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా కోటంరెడ్డితోనే ఉంటారని తెలుస్తోంది.