మిచౌంగ్ తుపాను కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షారు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. నెల్లూరు నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షపునీరు పోయే జాడ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
నెల్లూరు నగరం మధ్యనుంచి రైల్వే లైన్ వెళ్తుంది. ఈ రైల్వేలైను నెల్లూరు నగరాన్ని రెండుగా విభజిస్తుంది. అంటే నగరంలో రైల్వే లైన్ క్రాస్ చేసి అటు ఇటు ప్రయాణించాలంటే అండర్ బ్రిడ్జ్ లే దిక్కు. లెవల్ క్రాసింగ్ లు ఉన్నా కూడా రైళ్ల రద్దీతో వాటిని నగరవాసులు పెద్దగా ఉపయోగించరు. ఒకే ఒక్క ఫ్లైఓవర్ ఉన్నా.. అది నగరానికి చివర్లో ఉంటుంది. వర్షం వస్తే నగరంలోని అండర్ బ్రిడ్జ్ లు నీట మునుగుతాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఆదివారం అండర్ బ్రిడ్జ్ ల వద్ద పలు వాహనాలు నిలిచిపోయాయి. పాదచారులు అటు నుంచి ఇటు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారీ ఈ సమస్య ఉండేదే అయినా నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మిచౌంగ్ తుపాను ప్రభావం కొనసాగుతున్న ఈ సమయంలో నెల్లూరు అండర్ బ్రిడ్జ్ లు నీట మునిగాయి. నగర వాసులకు నరకం చూపించాయి.
సముద్ర తీర ప్రాంతాలకు కలెక్టర్..
మిచౌంగ్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్. అల్లూరు మండలం సముద్ర తీర గ్రామమైన ఇస్కపల్లిలో కలెక్టర్ పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భారీ వర్షం,గాలులు వీస్తున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతానికి, సైక్లోన్ షెల్టర్లకు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు కలెక్టర్. తీరప్రాంతంలో వున్న 9 మండలాల తహిశీల్దార్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు కలెక్టర్.
ఎస్పీ పరిశీలన..
మిచౌంగ్ తుఫాన్ కారణంగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎస్పీ పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడారు. వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా, తుపాను వెళ్లిపోయేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24 గంటలు అందుబాటు ఉంటారని భరోసా కల్పించారు. ప్రజలు పోలీసు సహాయక చర్యలకు డయల్- 112/100 లేదా పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 9392903413 కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించగలరని సూచించారు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి.
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన చౌంగ్ తుపాను రేపు(మంగళవారం) తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గర్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సోమవారం స్కూల్స్ కి సెలవు ఇచ్చారు. అవసరమైతే మంగళవారం కూడా సెలవు పొడిగించే అవకాశముంది.