Cyclone effect In AP: రాష్ట్రాని(Andhra Pradesh)కి మరో తుఫాను(Cyclone) గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఫెంగల్(Fengal) తుఫాను కారణంగా తమిళనాడులోని కొన్ని జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఏపీలోని తిరుపతి(Tirupati), నెల్లూరు(Nellore), అనంతపురం జిల్లాలపైనా పడింది. ఇక, తాజాగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారేందుకు చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదేసమయంలో వాయుగుండం.. నెల్లూరు వైపు వస్తుందా? తమిళనాడు వైపు వెళ్లుందా? అనే విషయంపై ఒక అంచనాకు రాలేక పోతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం.. ప్రభావం మాత్రం పడుతుందని చెబుతున్నారు.
రేపటి నుంచి వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో బుధవారం(ఈ నెల 18) నుంచి కోస్తా(Coastal) తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. అదేవిధంగా తదుపరి నాలుగు రోజులు కూడా.. ప్రకాశం(Prakasam), నెల్లూరు(Nellore), తిరుపతి(Tirupati) జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపైనా వాయుగుండం ప్రభావం ఉంటుందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కువరనున్నాయని తెలిపారు.
అధికారులు అప్రమత్తం
వాయుగుండం ప్రభావం.. ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమ్మత్తం చేసింది.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: మంత్రి
రాష్ట్రంలో ఎలాంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anita) తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విపత్తుల నష్టాన్ని తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై మూడు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రమాద అంచనా, ముందస్తు అవగాహన, వెంటనే స్పందించే అంశంపై అధికారులు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు.
మరోవైపు చలి-పులి!
ఒకవైపు కోస్తా తీరం వెంబడి జిల్లాలను వాయుగుండం భయపెడుతుంటే.. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలు శీతల గాలులతో వణుకుతున్నాయి. సాధారణంగానే ఉత్తరాంధ్రకు శీతల గాలులు(Cold Winds) ఎక్కువగా వీస్తాయి. అయితే.. ఈ సారి పది రోజుల ముందుగానే.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. దీంతో మన్యం జిల్లాలైన అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు గజగజలాడుతున్నారు. సోమవారం జి.మాడుగులలో 4.1 డిగ్రీలు, అరకులోయలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, చింతపల్లిలో 7.0, జీకే వీధిలో 7.3, హుకుంపేటలో 7.8 ,పెదబయలులో 9.0, అనంతగిరిలో 9.4 ,కొయ్యూరులో 11.6 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దుప్పటి ముసుగులో భాగ్యనగరం
తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) దుప్పటి ముసుగు తన్నింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది చలిగాలులు భాగ్యనగర వాసులను వణికిస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు చలిగాలుల తీవ్రత కొనసాగుతుండడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు వణికిపోతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు. ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే పలు ప్రాంతాల్లో 6నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. ఇక, చలిగాలులకు తోడు పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో రహదారులపై ప్రయాణం చేయడం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మరో రెండురోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ప్రజలు మాస్క్‌లు, స్వెటర్లను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా మార్నింగ్ వాక్ చేసేవారు 9 గంటల తర్వాత కానీ బయటకు రాకపోవడం గమనార్హం.