నెల్లూరు జిల్లా రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికల తర్వాత ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకంటే ముందు ఆయన నివేదికలు తెప్పించుకున్నారు. వాటి ప్రకారం విశ్లేషణలు జరిపి.. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు..? ఎవరు వైసీపీతో లాలూచీ పడ్డారనే విషయంలో ఓ రిపోర్ట్ రెడీ చేయించారు. దాని ప్రకారం నాయకులకు మొట్టికాయలు వేస్తున్నారు.
ఇటీవల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాభవం చవి చూసింది. కనీసం ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేకపోయింది. ఈ క్రమంలో పార్టీ ఓటమికి కారణాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అదే సమయంలో ముగ్గురు నాయకులపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కి గురైన నాయకులు వెంటనే రియాక్ట్ అయ్యారు. నేరుగా చంద్రబాబుని తప్పుబట్టలేదు కానీ, జిల్లా నాయకత్వాన్ని ఏకిపారేశారు. జిల్లా స్థాయి నాయకులే పార్టీని అమ్మేశారని, అనవసరంగా తమపై నిందలేసి చంద్రబాబు ముందు తమను చులకన చేశారని మండిపడ్డారు.
అక్కడితో ఆగని ఎపిసోడ్..
అయితే సస్పెన్షన్ల వేటు, సస్పెండ్ అయిన వారి ప్రతిదాడి తర్వాత మరో రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈసారి మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వైరిపక్షాలపై కూడా మండిపడ్డారు బాబు. ఆకురౌడీలకు భయపడకుండా టీడీపీ శ్రేణులు ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నేను మీ ముందున్నా.. మీరు పోరాడండి అంటూ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. టీడీపీకి 70 లక్షల సైన్యం ఉందని చెప్పారు బాబు. అందరూ కలసికట్టుగా తిరగబడితే వైసీపీ నేతలు పారిపోతారని ఎవరూ భయపడొద్దని చెప్పారు. నెల్లూరు ప్రజలు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించబోరని అన్నారు చంద్రబాబు.
నెల్లూరులో నాయకత్వ లోపం..
నెల్లూరు జిల్లా టీడీపీకి నాయకత్వ లోపం ఉందని అన్నారు చంద్రబాబు. గతంలో తాము అధికారంలో ఉండగా.. నెల్లూరు నగరాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామని, 40 వేల ఇళ్లు కట్టామని చెప్పారు బాబు. కానీ చేసింది చెప్పుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. అధికారపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారని, జిల్లాలో నాయకత్వ లోపం స్పష్టం కన్పిస్తోందని, ప్రక్షాళన చేసి తీరతానన్నారు. 15రోజుల్లో సమర్థులతో నెల్లూరులో అన్ని డివిజన్లకు తానే స్వయంగా కమిటీలను నియమిస్తామన్నారు బాబు. మొత్తమ్మీద నెల్లూరు జిల్లా సమీక్ష హాట్ హాట్ గా సాగింది.
Also Read: మా స్వామివారు మాకు దొరికారు.. చోరీ కేసు మీడియా సమావేశానికి వచ్చిన పూజారులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి