సహజంగా దొంగల ముఠాని పట్టుకున్నప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, వారిని మీడియాకి చూపించి రిమాండ్ కి తరలిస్తారు. కానీ నెల్లూరులో మాత్రం దొంగల ముఠాని పట్టుకున్న పోలీసుల ప్రెస్ మీట్ కాస్త వెరైటీగా సాగింది. దొంగలు తీసుకెళ్లింది స్వామివారి పంచలోహ విగ్రహాలు కావడం, అవి ఆ ఊరి వారికి సెంటిమెంట్ కావడంతో.. ఆ ఊరి పెద్దలు, నాయకులు, ఆలయ పూజారులు కూడా తరలి వచ్చారు. తమ స్వామివారిని తమకు అప్పగించినందుకు ఎస్పీ విజయరావుకి అభినందనలు తెలపడంతోపాటు వేదాశీర్వచనాలు అందించారు. 


నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని అచ్యుత స్వామి దేవాలయంలో.. శ్రీదేవి, భూదేవి సమేత అచ్యుత స్వామి పంచలోహ విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.  
 
నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసే ఆరుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోని ఐదు దేవాలయాల్లో వీరు విగ్రహాలు, హుండీలు, మైక్ సెట్లు దొంగిలించుకు వెళ్లారు. కడపలో 3, ప్రకాశంలో 2 దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఎట్టకేలకు వీరు నెల్లూరు పోలీసులకు చిక్కారు. వీరిలో ఐదుగురు కడప జిల్లా వాసులు కాగా.. దొంగల ముఠా నాయకుడు ప్రకాశం జిల్లా గిద్దరూలు వాసి, పేరు షేక్ లాల్ భాషాగా గుర్తించారు.  


ఆటోలో వస్తారు, అంతా దోచుకెళ్తారు
ఆలయాల్లో దొంగతనాలు చేసే ఈ ముఠా.. రెండ్రోజుల ముందునుంచీ రెక్కీ నిర్వహిస్తుంది. ఆటోలో వచ్చి అంచనా వేసుకుని వెళ్తారు. దొంగతనం చేసే రోజు కూడా వీరు ఆటోలో వచ్చి గుడి సమీపంలో దాన్ని ఆపుతారు. ఇద్దరు బయట కాపలా కాస్తే, నలుగురు లోపలికి వెళ్లి గ్రిల్స్ తొలగించి విగ్రహాలు, హుండీ, నగలు మాయం చేస్తారు. దేవాలయాలతోపాటు, చర్చిలో కూడా వీరు దొంగతనం చేసినట్టు తెలిపారు పోలీసులు. పంచలోహ విగ్రహాలు, 10వేల రూపాయల నగదు వీరినుంచి స్వాధీనం చేసుకున్నారు. 


ప్రెస్ మీట్ అనంతరం తమ స్వాములవారి విగ్రహాలను అందించినందుకు కుల్లూరు గ్రామస్తులు, నాయకులు ఎస్పీ విజయరావుని అభినందించారు. పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు.


Also Read: Warangal Crime: రోడ్డు పనుల్లో బంగారు హారం దొరికింది... నాటకంతో నకిలీ బంగారం విక్రయం... వరంగల్ వచ్చి పోలీసులకు చిక్కారు


Also Read: Nagapur Fake Gang Rape : రేపిస్టుల కోసం నాగపూర్‌లో వెయ్యి మంది పోలీసుల ఆపరేషన్ ! చివరికి అసలు తప్పు చేసిన వారు స్టేషన్‌లోనే దొరికారు..


Also Read: Woman Cuts Husband Genitals : నో అంటే నో..లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? వైఫ్ అయినా కట్ చేసేస్తుంది ! ఆ ఊళ్లో అదే జరిగింది !