ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పార్టీలు అటు ఇటు మారే నాయకుల సీజన్ మొదలైంది. ఈరోజు ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని బలప్రదర్శన హైలెట్ కాగా, నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన సొంత గూటికి చేరుకున్నారు.


బొమ్మిరెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు మేకపాటి కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సమక్షంలోనే బొమ్మిరెడ్డి వైసీపీలో చేరడం విశేషం. వారి వెంట గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్, వెంకటగిరి వైసీపీ ఇన్ చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉండటం మరో విశేషం.


బొమ్మిరెడ్డికి వెంకటగిరి టికెట్ ఇస్తారా..?


2019 ఎన్నికలకు ముందు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెంకటగిరి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆనంకు ఆ టికెట్ ఇచ్చారు జగన్. అప్పటి వరకూ బొమ్మిరెడ్డి వెంకటగిరిలో ప్రచారం చేసుకుంటూ, క్యాడర్ ని కలుపుకొంటూ వెల్లారు. ఆశాభంగం కావడంతో ఆయన వెంటనే ప్లేటు ఫిరాయించారు. టీడీపీలో చేరారు. కానీ టీడీపీలో ఉన్నా కూడా ఆయనకు ఫలితం దక్కేలా లేదు. ఆయన టీడీపీలో 2024 ఎన్నికల్లో ఆత్మకూరు తరపున పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ మళ్లీ ఆనం ఇక్కడికి కూడా వచ్చారు. 2024లో ఆత్మకూరు టీడీపీ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డికి ఖాయమని తేలిపోవడంతో ముందుగానే బొమ్మిరెడ్డి సర్దుకున్నారు. వైసీపీలో చేరారు. కండువా కప్పే ముందు ఆయనకు జగన్ టికెట్ గురించి హామీ ఇచ్చారా లేదా అనేది తేలడంలేదు.


నేదురుమల్లికి హ్యాండిచ్చినట్టేనా..?


వెంకటగిరిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి అధిష్టానానికి ఆగ్రహం తెప్పించడంతో పార్టీ ఆయన్ను పక్కనపెట్టింది. ఆ స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే కారణంతో ఆనం రామనారాయణ రెడ్డిపై పార్టీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. దీంతో ఆనం కథ ముగిసింది. మరి వెంకటగిరికి ఇన్ చార్జ్ గా ఉన్న నేదురుమల్లికి 2024లో అసెంబ్లీ టికెట్ గ్యారెంటీయేనా అనుకుంటున్న సమయంలో సడన్ గా బొమ్మిరెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటున్న క్రమంలో నేదురుమల్లిని పిలవాల్సిన అవసరం లేదు. కానీ జగన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టుకుని బొమ్మిరెడ్డి మెడలో కండువా వేశారు. అంటే వెంకటగిరి టికెట్ విషయంలో ఏదో జరుగుతోందనే హింట్ ఇచ్చినట్టే. రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరికి రైట్ పర్సన్ కాదు అనే ప్రచారం వైసీపీలో కూడా ఉంది. దీన్ని జగన్ కూడా నమ్ముతున్నారని, అందుకే ఆల్టర్నేట్ గా బొమ్మిరెడ్డిని వెంకటగిరికోసం రెడీ చేస్తున్నారని అంటున్నారు. వీటిలో ఏది నిజం, ఎంత నిజం అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. 


2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ.. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను చేజార్చుకుంది. ఆ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఇప్పుడు పక్క పార్టీల నేతలకు వైసీపీ గేలమేస్తోంది. మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని పార్టీలో చేర్చుకుంది.