మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కొన్నిరోజులుగా ఒంగోలులో లేరనే విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యలో సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లికి వెళ్లి ఆయన్ను కలసి వచ్చారు. దాదాపు వారం రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఈరోజు ఒంగోలుకి వచ్చారు. హైదరాబాద్, అమరావతి వెళ్లినప్పుడు తిరిగి ఆయన ఒంగోలుకు వచ్చేటప్పుడు పెద్దగా హడావిడి ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆయన రైలు దిగి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు వచ్చి నినాదాలు చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ వీడియోలకు జై బాలయ్య సాంగ్ కలిపి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. బాలినేని అధికారిక ఫేస్ బుక్ పేజీలో కూడా ఈ వీడియో కనపడటం విశేషం. 


బాలినేని వేరుపడినట్టేనా..?
బాలినేని ఒంగోలు ఎంట్రీ సమయంలో వందలమంది కార్యకర్తలు రైల్వే స్టేషన్ కి వచ్చినా ఎక్కడా పార్టీ జెండా కానీ, కండువా కానీ కనపడలేదు. అందరూ ఆయనకోసం పుష్పగుచ్ఛాలు తెచ్చి ఇచ్చారు. కారు వరకు వచ్చి జిందాబాద్ లు కొట్టారు. జై బాలినేని అన్నారే కానీ, జై జగన్ అనే నినాదాలు వినిపించకపోవడం విశేషం. ఇటీవల పార్టీ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జగన్ పిలిపించుకుని బుజ్జగించినా ఆయన మాట వినలేదు. ఆ తర్వాత ఆయన తొలిసారి జిల్లాకు వచ్చారు. దీంతో బాలినేని అభిమానులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఒకరకంగా పార్టీకి ఆయన దూరమవుతున్నారనే వార్తలకు ఈ ఘన స్వాగతం బలం చేకూర్చినట్టవుతోంది. 


బాలినేని వైసీపీలో ఉండాలనుకుంటే జగన్ మాటలకు కచ్చితంగా గౌరవం ఇచ్చేవారేమో. కానీ ఆయన కోఆర్డినేటర్ పదవి తనకు వద్దంటే వద్దని చెబుతున్నారు, తాను కేవలం నియోజకవర్గానికే పరిమితం అవుతానంటున్నారు. జిల్లాలో ఇటీవల మార్కాపురం సభలో జరిగిన అవమానంతో బాలినేని బాగా హర్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు ఇటీవల జిల్లాలో జరిగిన డీఎస్పీల నియామకం విషయంలో కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారట. ఇటీవల తాడేపల్లి వెళ్లిన సందర్భంలో కూడా ఆయన పోలీస్ నియామకాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి లేకపోయినా జిల్లాలో తన హవా ఉంటుందని గతంలో అధిష్టానం చెప్పిందని, కానీ ఇప్పుడు పోలీస్ల బదిలీల విషయంలో కూడా తన మాట చెల్లుబాటు కాకపోవడం ఏంటని ఉన్నతాధికారుల్ని ఆయన నిలదీశారని అంటున్నారు. 


బాలినేని పయనం ఎటు..?
కాంగ్రెస్ తరపున ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలినేని, వైసీపీలో చేరిన తర్వాత తొలిసారి బై ఎలక్షన్లలో విజయం సాధించారు. 2014లో ఓడిపోయినా, తిరిగి 2019లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రి వర్గంలో పదవి దక్కించుకున్నారు. రెండో దఫా ఆ పదవి పోయినా ఆయన హవా తగ్గలేదు. కానీ రాను రాను బాలినేని వ్యవహారంలో మార్పు వచ్చింది. మార్కాపురం సభ విషయంలో ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్ర అవమానంగా భావించారు. అప్పటికే ఆయన జనసేనతో టచ్ లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల జనసేన ప్రకాశం జిల్లా నేతలు కూడా బాలినేని వస్తే తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. ఈ వార్తలన్నీ కలకలం రేపుతున్న సమయంలోనే బాలినేని ట్రైన్ లో ఒంగోలుకి వచ్చిన తర్వాత ఆయన అభిమానులు ఘన స్వాగతం పలకడం మరింత సంచలనంగా మారింది. ఇంతకీ బాలినేని వైసీపీ విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ముందు ముందు తేలిపోతుంది.