Bigg Boss 6 Telugu Adireddy: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కలర్ ఫుల్ గా మొదలైంది. ఈ సీజన్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా అప్ కమింగ్ సెలబ్రిటీలే. ఇప్పుడిప్పుడే ఫామ్ పెంచుకుంటున్న వారిని బిగ్ బాస్ 6 హౌస్ లోకి పంపించారు. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన ఆదిరెడ్డి కూడా ఉన్నారు. ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చాడు కానీ, ఆయన ఇప్పటికే యూట్యూబర్ గా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి.


బిగ్ బాస్ రివ్యూలు రాస్తూ షో లోకి.. 
ఆదిరెడ్డి గతంలో బిగ్ బాస్ కి రివ్యూలు రాసేవాడు. బిగ్ బాస్ షో లను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు, ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందనే విషయాలను అవపోసన పట్టి రివ్యూలు రాస్తుండేవాడు. అలాంటి ఆదిరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషమే. ఆదిరెడ్డి మాత్రమే కాదు, బిగ్ బాస్ షో లకు రివ్యూలు రాస్తూ పాపులర్ అయిన గీతు రాయల్ అలియాస్ గలాట గీతు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే బిగ్ బాస్ షో లను కంటన్యూగా ఫాలో అవుతూ, తాము పాపులర్ అయి ఆ తర్వాత షో లోకి ఎంట్రీ ఇచ్చారు వీరిద్దరూ. 


ఎవరీ ఆదిరెడ్డి..?
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వరికుంట‌పాడు ఆదిరెడ్డి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆదిరెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆయనకు అన్న, అక్క, చెల్లి ఉన్నారు. తల్లి చనిపోవడంతో ప్రస్తుతం తండ్రితోపాటు ఉంటున్నాడు ఆదిరెడ్డి. ఆదిరెడ్డికి భార్య, ఒక పాప ఉన్నారు. ఇంజినీరింగ్ చదివిన తర్వాత బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన ఆదిరెడ్డి, అక్కడినుంచే బిగ్ బాస్ తెలుగు షో లకు రివ్యూలు రాసేవాడు. అలా చిన్న యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మంచి ఫాలోవర్స్ ని సంపాదించాడు. బిగ్ బాస్ షో లకు రివ్యూలు రాస్తూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 


నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి..
ఆమధ్య తన పింఛన్ డబ్బుల్ని సోనూ సూద్ ఫౌండేషన్ కి ఇచ్చిన దివ్యాంగురాలు నాగలక్ష్మి ఆదిరెడ్డికి సొంత చెల్లెలు. నాగలక్ష్మికి కళ్లు కనిపించకపోయినా ఆమె కరోనా టైమ్ లో సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ కి సాయం చేసి పాపులర్ అయ్యారు.




నాగలక్ష్మి కూడా ఓ యూట్యూబర్. ఆదిరెడ్డి భార్య కవిత, సోదరి నాగలక్ష్మి కలసి.. కవిత - నాగ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ తో బాగా పాపులర్ అయ్యారు. వంటల వీడియోలతో వీరు ఫేమస్ అయ్యారు. ఆదిరెడ్డి యూట్యూబ్ ఛానెల్ లో ఆయన తండ్రి కూడా కనిపిస్తుంటారు. ఇలా ఆ ఫ్యామిలీ అంతా యూట్యూబర్స్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. 




వివాదం ఏంటి..?
ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే చిన్న వివాదంలో చిక్కుకున్నాడు. బిగ్ బాస్ షో కి సోషల్ మీడియాకి అవినాభావ సంబంధం ఉంది. సోషల్ మీడియాలో ఓటింగ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్లు ఉంటాయి. దీనికోసం ముందుగానే ఆదిరెడ్డి ఫ్యాన్ పేజీలను క్రియేట్ చేసుకున్నారని ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఆదిరెడ్డి సపోర్టర్స్ అనే ఫ్యాన్ పేజ్ కి అప్పుడే 34వేలమంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.






ఆదిరెడ్డి పక్కా ప్లానింగ్ తో చేసినా.. ట్రోలింగ్స్ మొదలైనా.. అది ఆయన స్ట్రాటజీగానే భావించాలి. సోషల్ మీడియా నాడిని ముందే పసిగట్టాడు కాబట్టే ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరీలో షో లోకి ఎంట్రీ ఇచ్చాడు.