Balineni :  అనుకున్నంతా అయింది, మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరకు వచ్చింది. వైసీపీలో ఇక బాలినేని ఇమడలేరు అనే విషయం నిర్థారణ అయింది. జగన్ తో తనకేమాత్రం ఇబ్బంది లేదు అంటూనే బాలినేని సొంత పార్టీ నేతలకు చీవాట్లు పెట్టారు. కొంతమందికి సిగ్గులేదంటూ మాట్లాడారు. వారి పేర్లు బయటపెట్టడానికి తనకు సిగ్గుందని, తాను అలాంటి పనులు చేయబోనని, పార్టీని ఇబ్బంది పెట్టబోనని అన్నారు. 


టార్గెట్ వైవీ..



బాలినేని టార్గెట్ వైవీ సుబ్బారెడ్డి అనే విషయం   ఆయన నోటివెంటే బయటపడింది. తెలంగాణకు చెందిన   గోనె ప్రకాష్ రావు, తన గురించి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు బాలినేని. ఓ వైపు వైవీ సుబ్బారెడ్డిని దేవుడని, ఆయన భార్య దేవత అని గోనె ప్రకాష్ రావు పొగుడుతున్నారని, అదే నోటితో ఆయన జగన్ ని తిడుతున్నారని, ఇదెక్కడి లాజిక్ అన్నారు. పరోక్షంగా వైవీ సుబ్బారెడ్డి, వైసీపీకి నష్టం చేకూరుస్తున్నారని మాట్లాడారు. 


నాపై ఎందుకీ దుష్ప్రచారం..



తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలపై కూడా బాలినేని స్పందించారు. తాను ఎవరిపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని, చేయబోనని, అది తన నైజం కాదన్నారు బాలినేని. కానీ తనపై చాలామంది అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని, పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. 


కార్యకర్తలకోసం ఎందాకైనా..


ప్రెస్ మీట్లో బాలినేని ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సహజంగా పార్టీ మారే ముందు ఎవరైనా కార్యకర్తల అభీష్టం మేరకే అంటారు. బాలినేని కూడా ఇప్పుడు కార్యకర్తలు, అనుచరుల పేర్లు తెరపైకి తెచ్చారు. తనని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకోసం తాను ఎందాకైనా పోరాటం చేస్తానన్నారు. వారి కోసం తాను రాజకీయంగా నష్టపోయినా పరవాలేదన్నారు. రేపు పార్టీ మారినా కార్యకర్తలు, అనుచరులకోసమే అని చెప్పేందుకు ఆయన రూట్ క్లియర్ చేసుకున్నారని అర్థమవుతోంది. 


కంటతడి..
ఓ దశలో బాలినేని భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. ఆయన కళ్లు చెమర్చాయి. గంభీరంగా ఉండే బాలినేని ప్రెస్ మీట్లో ఇలా బేలగా మారిపోవడం అక్కడున్నవారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నియోజకవర్గంలో గడప గడపకు తిరిగే అవకాశం లేకపోవడం వల్లే తాను ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేశానని చెప్పిన బాలినేని, ప్రెస్ మీట్లో జగన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. తనకు వైఎస్ఆర్ అన్నీ అన్నట్టుగా మాట్లాడారు. దాదాపుగా వైసీపీలో బాలినేని ఎపిసోడ్ ముగిసిపోయిందనే చెప్పాలి. 


సాక్షి నో కవరేజ్..
వైసీపీ బాలినేనిని దూరం పెట్టింది అని చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఓ ఉదాహరణ. ఈ ప్రెస్ మీట్ ని సాక్షి కవర్ చేయలేదు. సహజంగా బాలినేని ప్రెస్ మీట్ అంటే అధికార పార్టీకి చెందిన ఛానెల్ లైవ్ కి రెడీగా ఉంటుంది. కానీ సాక్షి చప్పుడు చేయలేదు. అంటే పరోక్షంగా అందరికీ బాలినేని విషయంలో ఓ హింటిచ్చేసింది అధిష్టానం. ఇక అధికారిక నిర్ణయమే తరువాయి. బాలినేని ప్రెస్ మీట్ పై వైసీపీనుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.