నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఏపీలో ఉప ఎన్నికల (By Elections in Andhra Pradesh) మూడ్ వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి జనంలోకి వస్తున్నారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలసి ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆయన ప్రజల వద్దకు వెళ్తున్నారు. విక్రమ్ రెడ్డి పరిచయ కార్యక్రమం పేరుతో ఆయనను జనంలోకి తీసుకెళ్లబోతున్నారు రాజమోహన్ రెడ్డి.




ఇక ఆత్మకూరు పరిధిలోని అధికారులు, నేతలు కూడా విక్రమ్ రెడ్డిని కలుస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి హోదాలో.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా విక్రమ్ రెడ్డి బాధితులకు అందించారు. మొత్తమ్మీద నిన్న మొన్నటి వరకూ మేకపాటి కుటుంబంలో ఎవరికి టికెట్ ఇస్తారనే విషయంలో కాస్త చర్చ నడిచినా.. ఇటీవలే విక్రమ్ రెడ్డి సీఎం జగన్ ని కలసి ఆశీర్వాదం తీసుకుని వచ్చారు. మిగతా పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లేముందే.. విక్రమ్ రెడ్డి పని మొదలు పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరింత సందడి మొదలయ్యే అవకాశముంది. 




ఎన్నిక ఏకపక్షమేనా..?
ఏపీలో ఇప్పటి వరకూ రెండు ఉప ఎన్నికలు జరిగాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగగా.. టీడీపీ, బీజేపీ రెండూ పోటీలో నిలిచాయి. కానీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తిరుపతి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బద్వేల్ ఎమ్మెల్యే మరణంతో అక్కడ కూడా బైపోల్ జరిగింది. వైసీపీ అభ్యర్థే అక్కడ విజయం సాధించారు. ఇప్పుడిది మూడో ఉప ఎన్నిక. మంత్రి హోదాలో ఉండి మరణించిన గౌతమ్ రెడ్డి స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు జిల్లా విభజన తర్వాత కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలంతా వైసీపీవారే ఉన్నారు. ఆత్మకూరు పరిధిలోకూడ వైసీపీ బలంగా ఉంది. అదే సమయంలో మేకపాటి కుటుంబంపై ఉన్న సింపతీ కూడా ఎన్నికల్లో పనిచేసే అవకాశముంది. దీంతో ఎన్నిక ఏకపక్షమనే భావన జిల్లా నాయకుల్లో ఉంది. 


ప్రత్యర్థులెవరు..? 
దివంగత నేతల కుటుంబానికే టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని టీడీపీ ఇదివరకే చెప్పింది. అందుకే బద్వేల్ ఉప ఎన్నికలకు దూరంగా ఉంది. కానీ బీజేపీ మాత్రం తాము బరిలో ఉంటామని ముందునుంచీ చెబుతోంది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామన్నారు. అయితే బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. మేకపాటి కుటుంబానికి బంధువులైన బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీకి సై అంటున్నారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా సత్తా చూపిస్తానంటున్నారు. 


ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ బూత్ ల ఏర్పాటు, ఓటర్ లిస్ట్ ల సవరణ వేగవంతంగా జరుగుతోంది. బూత్ లెవల్ ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలకు సిద్ధంగా ఉండేందుకు అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. 


Also Read: Chandragiri SI Arrest : చంద్రగిరి ఎస్ఐ ఆరెస్ట్ - ఈయన నిర్వాకానికి ఓ యువతి ప్రాణం బలి ! 


Also Read: NTR District Vellampalli : పదవి పోగానే అందరూ దూరమయ్యారు ! ఎన్టీఆర్ జిల్లాలో ఎదురీదుతున్న వెల్లంపల్లి !