Nellore News : లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతిపై అత్యాచారాయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు, ట్రైల్ పూర్తి చేసి పోలీస్ శాఖ చరిత్ర సృష్టించిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వేగంగా కేసు దర్యాప్తు జరిపిన చేసిన సందర్భాలు లేవన్నారు. ఈ కేసు నమోదు అయి ట్రైల్ పూర్తి అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బాధితురాలు విదేశీ యువతి కావడంతో.. ఆమె దేశం విడిచి వెళ్తే జరిగే పరిణామాలను కేసు దర్యాప్తు, తీవ్రతపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఎప్పటికప్పుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసు దర్యాప్తు ముందుకు కొనసాగించామన్నారు.
దిశ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ
నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో తనపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు మార్చి 8వ తేదీ ఉదయం సుమారు 11.30 గంటలకు లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను మూడు గంటల్లో అరెస్టు చేశారు. డీజీపీ ఆదేశాలతో దిశ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు.
కేసులో నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి నిర్ణీత గడువులోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్పీకి డీజీపీ ఆదేశాలు జారీచేశారు.
నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్ష
సైదాపురం పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్ కు కేసు బదిలీ అయిన ఏడు రోజుల్లోనే నిర్ణీత గడువులోపే న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. న్యాయస్థానంలో తక్షణమే ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. షెడ్యూల్ మేరకు కేవలం మూడు రోజుల్లోనే న్యాయస్థానంలో విచారణను పూర్తి చేశారు. మార్చి 29 వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సాక్షుల విచారణ, ఒక రోజులోనే సేకరించిన సాక్ష్యాధారాల పరిశీలన, రెండు రోజుల్లో ఇరు పక్షాల వాదనలను న్యాయస్థానం పూర్తి చేసింది. ఈ కేసుపై తుది తీర్పును న్యాయస్థానం మే 5న వెల్లడించింది. మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, గూడూరు శారదనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్ అబీద్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
నేరస్థులకు గుణపాఠం
నేరస్థులకు ఈ విచారణ, శిక్ష ఒక గుణపాఠం అని పోలీసులు అంటున్నారు. గతంలో నేరాలకు పాల్పడితే సంవత్సరాల కొద్దీ శిక్షలు పడవు అని మహిళలపై నేరాలకు పాల్పడే వారికి ఇదొక గట్టి గుణపాఠం గా ఉంటుందన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోని పోలీస్, న్యాయవ్యస్థ, ప్రాసిక్యూషన్ అత్యంత వేగంగా సమన్వయంతో ఏకతాటిపై ముందుకు సాగుతూ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విదేశీ మహిళకు న్యాయం అందించామన్నారు.