కావలిలో చుక్కల భూముల పంపిణీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎ జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. సమస్య తీవ్ర తెలిసినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం 2016లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించిందన్నారు. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలన్న ఆలోచన చేయకుండా చంద్రబాబు రైతుల పొట్టకొట్టారన్నారు. ఇలా రైతులకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో అవసరాల నిమిత్తం అమ్ముకోవడానికి లేకుండా చేశారన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న తాను ఇబ్బందులను తొలగిస్తే తమపైనే అబండాలు వేస్తున్నారని మండిపడ్డారు.
మనసున్న ప్రభుత్వంగా రైతులకు మంచి జరగాలని కార్యక్రమాలు చేపడితే వాటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం సంవత్సరానికి 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవాళ్లను... అలాంటి ప రిస్థితి ఇప్పుడు లేదన్నారు. చంద్రబాబు ఆయనకు మద్దతు ఇస్తున్న దత్తపుత్రుడు రైతు బాంధువుల వేషం వేశారని విమర్శించారు. ఆ వేషాలతో రోడ్డు ఎక్కారన్నారు. రావణ సైన్యంలో భాగంగా వాళ్లకు ఓ వర్గం మీడియా వంతపాడుతుందన్నారు. వీళ్లంతా రైతులపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.
వ్యవసాయమే దండగన్న చంద్రబాబు ఓవైపు ఉంటే... ఆయన ఇచ్చిన ప్యాకేజీ, స్కిప్టును పట్టుకొని నటించే ప్యాకేజీ స్టార్ ఓవైపు.. వీళ్లిద్దరి డ్రామాను రక్తికట్టించే ఎల్లో మీడియా తానాతందానా అంటూ ఆడతున్నారని విమర్శించారు. వీళ్ల డ్రామాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు జగన్. వీళ్లు వస్తేనే కొనుగోలు ప్రారంభించారన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వీళ్లు అనుకున్నదాని కంటే వేగంగానే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అందుకే ఇలాంటి మాట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరి నాలుగేళ్లు ఎవరి కొన్నారని ప్రశ్నించారు జగన్.
2 లక్షల 10 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని అన్నారు జగన్. ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా లేదన్నారు. ఈ డబ్బులు ఊరికే పంచిపెడుతున్నానంటూ టీడీపీ వారి గజదొంగల ముఠా ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు దండగ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంటే చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎవరికీ రావని చెబుతున్నారన్నారు. స్కీమ్‌లను ఎత్తేసి దోచుకో, పంచుకో తినుకో అనే పద్ధతి తీసుకొస్తారని అన్నారు.